కేరళలోని వయనాడ్ జిల్లాలో వరద బాధితుల సంఖ్య గంట గంటకూ పెరుగుతోంది. వరదల కారణంగా కొండచరియలు విరిగిపడగా 80 మంది ప్రాణాలు కోల్పాయారు. మరో 600 మంది వలస కార్మికుల ఆచూకీ దొరకడం లేదు. ముండకై ప్రాంతంలోని తేయాకు, కాఫీ తోటలలో పని చేసేందుకు పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది మంది కార్మికుల జాడ ఇంతవరకూ దొరకలేదు.
హారిసన్ మలయాళి ప్లాంటేషన్ లిమిటెడ్లో పని చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ముండకైలోనే ఉంటున్నారు. మొబైల్ నెట్ వర్క్ పనిచేయకపోవడంతో తమ తోటల్లో పనిచేసే కార్మికులను ఫోన్ లో సంప్రదించలేకపోతున్నామని మలయాళి ప్లాంటేషన్ లిమిటెడ్ కంపెనీ జనరల్ మేనేజర్ బెనిల్ జోన్స్ తెలిపారు.
అసోం, బెంగాల్ నుంచి వచ్చిన 65 కుటుంబాల వారు నివాసం ఉంటున్నచోట కూడా కొండచరియలు విరిగిపడ్డాయని నివాసాలు ధ్వంసం అయ్యాయని స్థానికులు చెబుతున్నారు. వాయనాడ్ లో తీవ్ర విషాదం నేపథ్యంలో నేడు, రేపు( బుధవారం) సంతాప దినాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
చలియార్ నదిలో తేలియాడుతున్న 11 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో చాలా వాటికి శరీర భాగాల్లేవు. మూడేళ్ల పాప మృతదేహం కూడా కొట్టుకు వచ్చింది. ఆర్మీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఇప్పటి వరకు 80 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వేణు తెలిపారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు