అయోధ్యలో కొత్తగా నిర్మించిన దేవాలయంలోని బాలరాముడి చిత్రంతో ఆగ్నేయాసియా దేశం లావోస్ తాజాగా ఒక స్టాంపు విడుదల చేసింది. రాముడి బొమ్మతో పోస్టల్ స్టాంప్ విడుదల చేసిన మొట్టమొదటి దేశం లావోస్ దేశమే.
భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇటీవల లావోస్ రాజధాని వియెంటియాన్కు వెళ్ళారు. అక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో లావోస్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి అయిన సాలెముక్షే కొమాసిత్, జయశంకర్ కలిసి ఈ స్టాంపును విడుదల చేసారు. ఇరుదేశాల మధ్యా ఉన్న గాఢమైన సాంస్కృతిక, నాగరికతా సంబంధాలకు ప్రతీకగా బాలరాముడి స్టాంపును లావోస్ దేశం రూపొందించింది.
బుద్ధభగవానుడి చిత్రంతో కూడిన మరో స్టాంపును కూడా ఇరుదేశాల విదేశాంగ మంత్రులూ విడుదల చేసారు. లావోస్ ప్రాచీన రాజధాని లువాంగ్ ప్రబంగ్ ప్రముఖ బౌద్ధక్షేత్రం. అక్కడున్న బుద్ధుడి మూర్తి తరహాలో ఆ స్టాంపును రూపొందించారు. భారతదేశంలో జన్మించిన బౌద్ధధర్మం లావోస్ సహా పలు ఆగ్నేయాసియా దేశాల్లో నేటికీ ప్రభావం కలిగి ఉంది.
లావోస్ సంస్కృతిలో రామాయణానికి ప్రత్యేక స్థానం ఉంది. వారి రామాయణాన్ని రామాకీన్ అంటారు. పర్వదినాల సందర్భాల్లో రామాయణాన్ని ప్రదర్శించడం లావోస్ ప్రజల సంప్రదాయం. ఆగ్నేయాసియా అంతటా వ్యాపించిన సనాతన ధర్మపు జాడలకు, రామాయణ గాధలకూ లావోస్ ఒక నిదర్శనం.