శ్రీశైలంలో కృష్ణమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు జలహారతి ఇవ్వనున్నారు. ఆగస్టు 1న శ్రీశైలం పర్యటనకు వెళ్ళనున్న చంద్రబాబు, గంగమ్మకు సారె, చీర సమర్పించనున్నారు. పూజాది కార్యక్రమాల అనంతరం జలాశయాన్ని, జల విద్యుత్ కేంద్రాన్ని చంద్రబాబు పరిశీలిస్తారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్ల ద్వారా దిగువకు నీరు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో 4,60,040 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 1,41,560 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 880.90 అడుగులుకు నీరు చేరింది. విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
నాగార్జున సాగర్‌లోకి సోమవారం సాయంత్రం 6 గంటలకు 54,772 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 512.6 అడుగుల మేర ఉంది. సాగర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు. ఇదే తరహా వరద ప్రవాహం కొనసాగితే మరో ఆరేడు రోజుల్లో నాగార్జునసాగర్ నిండుతుంది. ఆల్మట్టి డ్యాంలోకి 3 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతేస్థాయిలో దిగువకు వదులుతున్నారు. తుంగభద్రకు సైతం ప్రమాదకరస్థాయిలో వరద పోటెత్తింది.