2024 పారిస్ ఒలింపిక్స్ మొదటిరోజే మహిళల 10మీటర్ల ఎయిర్‌పిస్టల్ ఫైనల్స్‌లో భారత క్రీడాకారిణి మనూ భాకర్ కాంస్య పతకం సాధించింది. ఆ వార్త సహజంగానే భారతీయులకు ఆనందం కలిగించింది. దేశవ్యాప్తంగా అందరూ సంబరాలు చేసుకున్నారు. అక్కడిదాకా బాగానే ఉంది.
ఆ విజయం తర్వాత ఆమె, ఫైనల్స్ ముందు తన మనస్సులో భగవద్గీత గురించి తలచుకున్నాననీ, ‘కర్మ చేయి – ఫలితం గురించి ఆలోచించకు’ అన్న కృష్ణుడి వాక్కును మననం చేసుకున్నాననీ చెప్పింది. గీతలో ప్రముఖమైన ‘‘కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన, మాకర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి’’ శ్లోకాన్ని ఉటంకించింది. క్రీడలోనే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా తనపై భగవద్గీత ప్రభావం ఎంతో ఉందని మనూ భాకర్ వెల్లడించింది. అదిగో, అక్కడ సమస్య వచ్చిపడింది. ఎర్ర-నీలి-పచ్చ కళ్ళ మేతావుల మనసుల్లో మనూభాకర్ శత్రువుగా మారిపోయింది.
మనూ భాకర్ – భగవద్గీత:
అసలు మను తన జీవితంలోకెల్లా గొప్పవిజయం సాధించినప్పుడు ఆనందించకుండా, ‘‘నీ కర్మ నీవు చేయి, ఫలితం గురించి ఆలోచించకు’’ అనే గీతావాక్యం గురించి ఎందుకు మాట్లాడింది?
సరిగ్గా నాలుగేళ్ళ క్రితం 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించాల్సిన మనూ భాకర్, తన పిస్టల్ సరిగ్గా పని చేయకపోవడంతో ఓటమి పాలైంది. ఒక్క 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్లోనే కాదు, మిక్సెడ్ టీమ్ 10 మీటర్ల, 25 మీటర్ల పోటీల్లో కూడా మనూ భాకర్ దెబ్బ తింది. అక్కడ ఆమె ప్రతిభలో కొరత లేదు. ప్రతికూల పరిస్థితుల వల్ల పరాజయం పాలయింది. ఒలింపిక్స్‌లో పతకం గెలిచే అవకాశం ఒకసారి కోల్పోవడమంటే మళ్ళీ రావడానికి ఎంత కష్టపడాలో మనూకు తెలిసినంతగా మన ఎవరికీ తెలియదు. ఆ నేపథ్యంలో ఇప్పుడు 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యపతకం గెలుచుకోవడం ఆమెకు పెద్ద ఊరట. అందుకే, ఇన్నేళ్ళుగా తనకు మానసికంగా వెన్నుదన్నుగా నిలిచిన గీతావాక్యాన్ని ఆటకు ముందూ, తర్వాతా తలచుకుంది.
అది తట్టుకోలేకపోతున్నారు లాల్-నీల్-హరా హరామ్ఖోర్లు. మను భగవద్గీత గురించి మాట్లాడింది. గీత అంటే హిందూమతానికి చెందిన విషయం. హిందూమతానికి ప్రోద్బలం ఇచ్చేది బీజేపీ. ఆ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. ప్రధాని మోదీ మనూ భాకర్‌కు ఫోన్ చేసి అభినందించారు. ‘‘టోక్యోలో పిస్టల్ నిన్ను మోసం చేసింది, కానీ ఇప్పుడు దానికా అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఆడావు, గెలిచావు. నీ విజయం దేశానికి ప్రత్యేకం’’ అంటూ ప్రశంసించారు. అవి చాలవా కళ్ళలో నిప్పులు పోసుకోడానికి.
మను విజయంలో మోదీ క్రెడిట్ తీసేసుకుంటున్నాడు, ఆటల గురించి అఆలు కూడా తెలీని ప్రధాని, ఒలింపిక్స్‌లో పతకాన్ని తన ఘనతగా చెప్పేసుకుంటాడు. దేశంలో క్రీడాకారులకు ఎలాంటి సౌకర్యాలూ, వసతులూ ఏర్పాటు చేసే వ్యవస్థ లేదు. క్రీడలన్నా, క్రీడాకారులన్నా ఆదరణ లేదు, వారి విజయాలను మాత్రం తమ ఖాతాలో వేసేసుకోడానికి ముందుంటాడు. దానికి దేశభక్తి, జాతీయతావాదం అనే రంగు పులిమేస్తారు. ఢిల్లీలో క్రీడాకారుల ఆందోళనల పట్ల సానుభూతి చూపని పాలకవర్గం ఇప్పుడు మాత్రం ఒలింపిక్స్ పతకాలను తన ఘనతగా ప్రదర్శించేసుకుంటుంది… బ్లా బ్లా బ్లా… అంటూ తమ అతితెలివిని అంతటినీ వెర్బల్ డయేరియాగా మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ పుంఖానుపుంఖాలుగా కక్కేస్తున్నారు.
విదేశాల్లో క్రీడలను ప్రోత్సహించే సంస్కృతి ఉంటుంది, బాల్యం నుంచే ప్రతిభను గుర్తించి సానపెడతారు. సరైన మౌలిక సదుపాయాలూ, శిక్షణా అందుబాటులో ఉంటాయి. అలాంటివేమీ మనదేశంలో ఉండవు. క్రీడాకారులు తమ సొంత ప్రతిభ మీద గెలిస్తే ఆ గెలుపును నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వం తమ సొంతం చేసేసుకుంటాయి… ఇదీ స్థూలంగా వారి వాదన.
‘టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ – టాప్స్’:
2014లో ఎన్డీయే సర్కారు పాలన మొదలయ్యాక యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) అనే పథకాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా గుర్తించిన క్రీడాకారులకు సమగ్ర శిక్షణ ఇస్తారు. కోర్ గ్రూప్ ఆఫ్ అథ్లెట్స్‌ను ఏర్పాటు చేసి వారికి పూర్తి అండగా నిలుస్తారు. ఎంపిక చేసిన క్రీడాకారులకు విదేశీ క్రీడాపోటీల వాతావరణాన్ని అలవాటు చేయడం, అవసరమైన వారికి విదేశీ కోచ్‌లను ఏర్పాటు చేయడం, విదేశాల్లో జరిగే పోటీలకు తగినట్లుగా శిక్షణ ఇవ్వడం ఈ పథకం లక్ష్యాలు. టాప్స్‌కు ఎంపికైన క్రీడాకారులకు అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందించి వారిని పతకం సాధించే దిశగా నడిపించడం అనే ఒకే ఒక లక్ష్యంతో మిషన్ ఒలింపిక్ సెల్ పనిచేస్తోంది.
టాప్స్ పథకం స్పాన్సర్ చేసిన క్రీడాకారులు 2016 రియో ఒలింపిక్స్‌లోనూ, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ గతంలో కంటె మంచి ఫలితాలు సాధించారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ, పారాలింపిక్స్‌లోనూ గణనీయమైన ప్రతిభ చాటారు. 73 సంవత్సరాల తర్వాత థామస్ కప్ టోర్నమెంట్‌ను భారత్ గెలుచుకుంది.
‘ఖేలో ఇండియా’ కార్యక్రమం:
నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయాక క్రీడలకు ప్రోత్సాహం కల్పించే లక్ష్యంతో మొదలుపెట్టిన మరో ముఖ్యమైన కార్యక్రమం ఖేలో ఇండియా. దీని ఏకైక లక్ష్యం దేశంలో క్రీడాసంస్కృతిని పునరుద్ధరించి పునరుజ్జీవింపజేయడమే. దేశంలోని అన్నిరకాల క్రీడలనూ ఒక గొడుగు కిందకు తెచ్చి, గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి వరకూ ఆటగాళ్ళను ప్రోత్సహించి, భారత్‌ను ప్రముఖ క్రీడాదేశంగా మలచాలన్న ఆశయంతో ఈ కార్యక్రమం పనిచేస్తోంది. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ఖేలో ఇండియాలో 12 విభాగాలను నిర్వహిస్తున్నారు. వాటిలో ముఖ్యమైనవి రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా కేంద్రాలు, ప్రతిభ అన్వేషణ-అభివృద్ధి, ప్రతీయేడాదీ క్రీడాపోటీలు, పాఠశాల విద్యార్ధుల ఫిజికల్ ఫిట్నెస్ మొదలైనవి.
ఈ కార్యక్రమం కింద 3వేలమందికి పైగా అథ్లెట్లకు శిక్షణ అందించారు. వారికి ఏటా రూ.6లక్షలకు పైగా ఉపకార వేతనాలు ఇస్తున్నారు. 2023 అక్టోబర్ నాటికి ఈ పథకం కింద రూ.2.5వేల కోట్ల సహాయం అందించారు. ఈ కార్యక్రమం ద్వారా సానపట్టిన క్రీడాకారులు 125 మందిని ఆసియా క్రీడలకు పంపించారు. వారు 40కి పైగా పతకాలు సాధించడం విశేషం.
ఖేలో ఇండియా ప్రత్యేకంగా కొన్ని విశేష అంశాలపై దృష్టి సారించింది. మహిళల క్రీడలు, క్రీడల్లో దివ్యాంగులు ప్రోత్సాహం, గ్రామీణ-దేశీయ-ఆదివాసీ క్రీడలకు ప్రచారం వంటి అంశాలను ప్రోత్సహించింది. ఖేలో ఇండియా కింద ఇప్పుడు పారా గేమ్స్‌ను కూడా మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. మారుమూల గ్రామాలకు పరిమితమైన క్రీడాప్రతిభను వెలికితీయడానికి దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా కేంద్రాలు ప్రారంభించింది.
క్రీడల్లో పెట్టుబడులు, బడ్జెట్ కేటాయింపులు:
పదేళ్ళ క్రితంతో పోలిస్తే క్రీడల బడ్జెట్ మూడు రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో క్రీడలు, యువజన వ్యవహారాల శాఖకు 3వేల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు విడిగా చేసే బడ్జెట్ కేటాయింపులు కూడా పెరిగాయి. ఖేలో ఇండియా పథకం కింద 2500 మంది క్రీడాకారులకు ప్రతీ నెలా రూ.50వేలు చెల్లిస్తున్నారు.
క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి:
‘ఖేలో ఇండియా’ కింద భారత ప్రభుత్వం దేశంలో వెయ్యి జిల్లాల్లో క్రీడా కేంద్రాలు నెలకొల్పుతోంది. మణిపూర్‌లో రూ.800 కోట్లతో భారతదేశపు మొట్టమొదటి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో మేజర్ ధ్యాన్‌చంద్ క్రీడా విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేస్తోంది.
ఎన్డీయే ప్రభుత్వం 2023లో నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీని కూడా రూపొందించింది. 2030 నాటికి సురక్షితమైన, చవకైన, అందరికీ అందుబాటులో ఉండే ఎయిర్ స్పోర్ట్స్ వ్యవస్థను అమల్లోకి తీసుకురావడమే దాని లక్ష్యం. ఇంక 2019లో ప్రారంభించిన ఫిట్ ఇండియా ఉద్యమం లక్ష్యం ఒక్క క్రీడాకారుల్లోనే కాక దేశ ప్రజలందరినీ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇచ్చేలా ప్రేరణ కలిగించడం.
గత దశాబ్దంలో క్రీడారంగంలో భారత్ ప్రగతి:
2014 తర్వాత దేశ క్రీడారంగంలో మొదలైన మార్పులు సానుకూల ఫలితాలనివ్వడం మొదలైంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా క్రీడాకారులను ప్రోత్సహించి, వారు ముందడుగు వేసేలా ప్రేరణ కలిగిస్తోంది. దాని ఫలితాలు కూడా సానుకూలంగా వస్తున్నాయి. గతంలో ఎన్నడూ పతకాలు సాధించని క్రీడాంశాల్లో భారతీయ క్రీడాకారులు విజయాలు నమోదు చేస్తున్నారు. గతేడాది చైనా హాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది. మొత్తం 655 మంది భారతీయ క్రీడాకారులు ఆ పోటీల్లో 41 విభాగాల్లో పాల్గొన్నారు. 107 పతకాలు సాధించారు. వాటిలో 28 స్వర్ణ పతకాలు, 38 రజత, 41 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆ వెంటనే జరిగిన ఆసియన్ పారా గేమ్స్‌లో సైతం భారత్ గొప్ప ఫలితాలు సాధించింది. మన దేశపు దివ్యాంగులు 111 పతకాలు గెలిచారు. వాటిలో 29 స్వర్ణ, 31 రజత, 51 కాంస్య పతకాలు ఉన్నాయి.
ప్రపంచ క్రీడా యవనికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన, విజయాలు సాధించిపెట్టిన క్రీడాకారులను ప్రధాని ప్రోత్సహించడాన్ని, వారితో సమావేశమై నాలుగు మంచిమాటలు మాట్లాడడాన్ని సైతం సహించలేకపోతున్నారు. అయితే, క్రీడాకారులకు అటువంటి ప్రోత్సాహం ఎంతటి స్ఫూర్తిని కలిగిస్తుందో వారు ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తారు. ‘కళాకారుడికి కావలసింది ప్రేక్షకుల చప్పట్లే’ అని కబుర్లు చెప్పే వామపక్షీయులు, క్రీడాకారుడికి కూడా అలాంటి ప్రోత్సాహమే కావాలన్న విషయాన్ని మాత్రం పట్టించుకోరు.
క్రీడాకారుల విజయాలను మోదీ తన గొప్పతనంగా చాటుకుంటారని, ప్రచారానికి వాడుకుంటారనీ లాల్-నీల్-హరా భావజాలాల ఇంకో దుష్ప్రచారం. నిజానికి క్రీడాకారుల జయాపజయాలకు అతీతంగా వారికి అండగా నిలవడం గత పదేళ్ళ కాలంలోనే చూస్తున్నాం. టోక్యో ఒలింపిక్స్‌లో పరాజయం పాలైన భారత మహిళల హాకీ బృందానికి మోదీ ధైర్యం చెప్పారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల క్రికెట్ టీమ్ స్వర్ణాన్ని చేజార్చుకున్నప్పుడు వారికీ సాంత్వన పలికారు. తాజాగా మనూను అభినందించేటప్పుడు కూడా టోక్యోలో పరాజయాన్ని అధిగమించి పారిస్‌లో పతకం సాధించిన ఆమె పోరాట పటిమను అభినందించారు.
ఉపసంహారం:
ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దేశంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి. ఆ సమయంలో కాంగ్రెస్‌కు అండగా నిలిచినవి ఈ లాల్-నీల్-హరా హరామ్‌ఖోర్ ముఠాలే. దేశీయ విద్యావ్యవస్థను నాశనం చేసి కృతకమైన చదువుల వ్యవస్థను ఏర్పరచి, దేశపౌరుల సమగ్ర మానసిక వికాసానికి ఎలాంటి అవకాశమూ లేకుండా చేసిన కాంగ్రెస్ పాలనలోనే దేశ క్రీడా వ్యవస్థలు క్షీణించిపోయాయన్న నిజాన్ని పైకి చెప్పరు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సైతం క్రీడాకారులు రాణిస్తే వారిని అభినందించరు. ఇప్పుడు మారుతున్న దేశ క్రీడాముఖచిత్రాన్ని పరిశీలించరు. ఒక క్రీడాకారిణి భగవద్గీతను ఉటంకించగానే ఈ లౌకికవాద ముసుగులోని మూర్ఖులకు అపారమైన బాధ, అంతులేని ఆవేదన కలుగుతాయి. సరిగ్గా అలాంటప్పుడే మనూ భాకర్ చెప్పిన కృష్ణుడి గీతావాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన.