సుదీర్ఘ విరామం తర్వాత ఆసియకప్ -2025కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. దాదాపు 34 ఏళ్ళ విరామం అనంతరం పురుషుల క్రికెట్ ఆసియాకప్ టోర్నమెంట్ భారత్ లో జరగనుంది. ఈ విషయాన్ని ఆసియా క్రికెట్ మండలి నిర్ధారించింది. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్-2026ను దృష్టిలో ఉంచుకొని సన్నాహకంగా టీ20 ఫార్మాట్లో ఈ టోర్నీని జరపనున్నారు.
ఇక 2027 ఆసియా కప్‌కు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈటోర్నీ మాత్రం 50-ఓవర్ల ఫార్మాట్లోనే జరగనుంది.
అదే ఏడాది దక్షిణాఫ్రికా, నమీబియాల సంయుక్త ఆతిథ్యంలో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్, భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పాటు టెస్ట్ ఫార్మాట్ క్రికెట్ ఆడని ఒక ఆసియా జట్టుకు అవకాశం కల్పించనున్నారు.
ఆసియా కప్ టోర్నీ చివరిసారిగా 1991లో భారత్ లో జరిగింది. దౌత్య సంబంధాల దృష్ట్యా అత్యధిక ఆసియా కప్‌లకు బంగ్లాదేశ్, శ్రీలంక వేదికగా జరిగాయి. పాకిస్తాన్ లో కూడా కొన్ని టోర్నీలు జరిగాయి. అయితే భారత్ అక్కడికి వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో పలు మ్యాచ్ లు శ్రీలంకలో నిర్వహించారు.