త్రిపుర రాజధాని అగర్తలా రైల్వేస్టేషన్ ఈమధ్య బాగా వార్తల్లోకెక్కుతోంది. దేశ సరిహద్దుల వెంబడి ఎన్నో పోలీస్ స్టేషన్లు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాలూ ఉన్నప్పటికీ అక్కడ ఎక్కడా బంగ్లాదేశీ చొరబాటుదారులు పట్టుబడడం లేదు. భారత్‌లోకి చొరబడ్డాక దేశంలోకి విస్తరించడం కోసం అగర్తలా రైల్వేస్టేషన్‌కు వచ్చినవారు మాత్రం కచ్చితంగా దొరుకుతున్నారు.
జులై 27 శనివారం నాడు 23మంది బంగ్లాదేశీ చొరబాటుదారులను అగర్తలా రైల్వేస్టేషన్లో అరెస్ట్ చేసారు. ‘‘వారందరూ బంగ్లాదేశ్‌లోని చపాయ్, నవాబ్‌గంజ్ ప్రాంతానికి చెందినవారే. అందరూ 18 నుంచి 30ఏళ్ళ వయస్సు లోనివారే’’ అని జిఆర్పి, ఆర్పిఎఫ్ పోలీసులు ధ్రువీకరించారు. చొరబాటుదారులు హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా పట్టుబడ్డారు.
గత రెండు నెలల్లోనే అగర్తలా రైల్వేస్టేషన్లో వందమందికి పైగా బంగ్లాదేశీ చొరబాటుదారులు పట్టుబడ్డారు. అయితే వారు అసలు ఈ రైల్వేస్టేషన్‌కు ఎలా చేరుకుంటున్నారో ఇప్పటికీ తెలియడం లేదు. నిజానికి బంగ్లాదేశ్ నుంచి అగర్తలా చేరుకునే దారిలో చాలా జిల్లాలు, చాలా పోలీస్ స్టేషన్లూ ఉన్నాయి. స్థానిక పోలీసులు కానీ, నిఘావర్గాలు కానీ ఈ చొరబాటుదార్లను పట్టుకోలేకపోతుండడం ఆందోళనకరమైన అంశం.
అదేరోజు, మరో ఆరుగురు బంగ్లాదేశీ చొరబాటుదారులను అగర్తలాలోని మహారాజా వీర్ విక్రమ్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టడీలోకి తీసుకున్నారు. ‘‘సిఐఎస్ఎఫ్ సిబ్బంది అనుమానాస్పదంగా ఉన్న ఆ ఆరుగురినీ అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో వారు సంతృప్తికరమైన జవాబులు చెప్పలేదు. దాంతో వారిని అరెస్ట్ చేసి జులై 28న స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం వారిని పోలీస్ కస్టడీకి తరలించింది’’ అని విమానాశ్రయం పోలీస్ ఆఫీసర్ ఇన్చార్జ్ అభిజిత్ మండల్ వెల్లడించారు.
బంగ్లాదేశీయులు భారీసంఖ్యలో భారత్‌లోకి చొరబడుతుండడానికి కారణాలు తెలియరావడం లేదు. ఈ అనధికార చొరబాట్లు జరిపిస్తున్న నెట్‌వర్క్‌లను గుర్తించడానికి పూర్తిస్థాయి విచారణ ప్రారంభించారు. ‘‘ఈ క్రమాన్ని చూస్తుంటే దేశ భద్రతకు ముప్పు ప్రమాదం పొంచివుంది. ఇది కేవలం సరిహద్దుల భద్రతకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. ఈ పేటర్న్ను పరిశీలించకపోతే దేశవ్యాప్తంగా భద్రతకు భారీముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది’’ అని నిఘా విభాగంలో పనిచేసిన మాజీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
వీరే కాకుండా బీఎస్ఎఫ్ త్రిపుర విభాగం 384మంది అక్రమచొరబాటుదారులను అదుపులోకి తీసుకుంది. వారిలో 208మంది బంగ్లాదేశీయులు, 160 మంది రోహింగ్యాలూ ఉన్నారు. మిగతా 16మందీ దళారులు. డబ్బులు తీసుకుని పొరుగుదేశాల వారిని మనదేశంలోకి తీసుకొస్తున్న దుర్మార్గులు. ఈ అక్రమ చొరబాట్లను సమర్థంగా కట్టడి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.