పారిస్ ఒలింపిక్స్‌లో ఒక నేరస్తుడికి అవకాశం లభించింది. మైనర్ బ్రిటిష్ బాలికపై అత్యాచారం చేసినట్లు నేరం నిరూపణ అయిన నెదర్లాండ్స్ వ్యక్తికి ఒలింపిక్స్‌లో ఆడేందుకు చోటు కల్పించారు. ఆదివారం బీచ్‌వాలీబాల్ మ్యాచ్ ఆడడానికి నెదర్లాండ్స్ జట్టులో భాగంగా ‘స్టీవెన్ వాన్ డె వెల్డె’ ఫీల్డ్‌లోకి వచ్చినప్పుడు ప్రేక్షకులు పెద్దగా అరుపులు కేకలు పెట్టడంతో ఆ విషయం వెల్లడైంది.
స్టీవెన్ వాన్ డె వెల్డె 2014లో, అతనికి 19ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఫేస్‌బుక్ ద్వారా బ్రిటన్‌కు చెందిన 12ఏళ్ల మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆమె కోసం నెదర్లాండ్స్ నుంచి మిల్టన్ కీన్స్ వెళ్ళాడు. అక్కడ వారిద్దరూ కలిసాక ఆమెను మద్యం తాగించాడు. ఆమె మత్తులోకి వెళ్ళిపోయాక ఆమెపై అత్యాచారం చేసాడు.
కోర్టు విచారణలో అతనికి ఆ బాలిక వయస్సు గురించి తెలుసనీ, అయినప్పటికీ అత్యాచారానికి పాల్పడ్డాడనీ ఋజువయింది. బాలికను రేప్ చేసిన నేరాన్ని అంగీకరించాడు. 2016లో అతనికి కోర్టు నాలుగేళ్ళ జైలుశిక్ష విధించింది.
వాన్ డె వెల్డె ఇంగ్లండ్ జైల్లో ఒక్క యేడాది మాత్రమే శిక్ష అనుభవించాడు. తర్వాత అతని స్వదేశం నెదర్లాండ్స్ జైలుకు బదిలీ చేసారు. అక్కడ కొన్నినెలల తర్వాత, 2017లో విడుదల చేసారు. ఆ తర్వాత అతను బీచ్‌వాలీబాల్ ఆడడం కొనసాగించాడు. గత నెల డచ్ ఒలింపిక్ టీమ్‌లోకి కూడా ఎంపికయ్యాడు.
నేరం నిరూపణ అయిన రేపిస్టు ఏకంగా తన దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం పొందాడు. కానీ బాధిత బాలిక అప్పటి అత్యాచారపు మానసిక క్షోభ నుంచి ఇప్పటికీ కోలుకోలేదు. తర్వాత ఆమె డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం, ప్రాణాలు తీసుకోడానికి ప్రయత్నించడం వంటి పనులు చేసింది. ఇప్పటికీ ఆమె పరిస్థితి కుదురుకోలేదు.
ఆదివారం ఇటలీ-నెదర్లాండ్స్ మధ్య ఓపెనింగ్ మ్యాచ్ సందర్భంగా వాన్ డె వెల్డె పేరును అనౌన్సర్ ప్రకటించగానే ప్రేక్షకులు ఒక్కసారిగా అరుపులు, కేకలతో తమ నిరసన వ్యక్తం చేసారు.
నేరం చేసి శిక్ష అనుభవించిన వ్యక్తిని ఒలింపిక్స్‌కు ఎంపిక చేయడాన్ని నెదర్లాండ్స్ నేషనల్ ఒలింపిక్ కమిటీ సమర్థించుకుంది. అతను తన శిక్షను అనుభవించాడనీ, సుదీర్ఘమైన రిహాబిలిటేషన్ ప్రోగ్రాం పూర్తి చేసాడనీ వెల్లడించింది. అతను మళ్ళీ అలాంటి నేరం చేసే అవకాశం లేదని నిపుణులు సైతం చెప్పుకొచ్చారు.
అయితే, నెదర్లాండ్స్ జట్టులో అతన్ని ఎంపిక చేయడాన్ని తప్పుపడుతూ 81వేల మందికి పైగా ప్రజలు ఆన్‌లైన్ పిటిషన్ మీద సంతకాలు చేసారు. లైంగిక నేరాలకు పాల్పడిన వారిని ఒలింపిక్స్ నుంచి పూర్తిగా నిషేధించాలని వారు డిమాండ్ చేసారు. ఆ నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ ఫెడరేషన్ ఒక నిర్ణయం తీసుకుంది. పారిస్ ఒలింపిక్స్ అథ్లెట్స్ విలేజ్‌లో స్టీవెన్ వాన్ డె వెల్డెకు చోటు కల్పించలేదు. నెదర్లాండ్స్ ఒలింపిక్ కమిటీ గ్యారంటీ మీద అతనికి ఒలింపిక్ విలేజ్ బైట ఒక హోటల్లో బస ఏర్పాటు చేసారు.
విచిత్రం ఏమంటే, షార్లొట్ డుజార్డిన్ అనే బ్రిటిష్ క్రీడాకారిణికి ఈ ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి అవకాశం ఇవ్వలేదు. నాలుగేళ్ళ క్రితం ఆమె తన గుర్రాన్ని 24సార్లు ‘కొరడాతో కొట్టిన నేరానికి’ ఆమెపై విచారణ సాగుతోంది. ఆమె పబ్లిక్ ఫండింగ్‌ను ఆపేసారు. గతంలో ఆమె ఒక చారిటీకి అంబాసిడర్‌గా ఉండేది, దాన్నుంచి కూడా తప్పించారు. ఇక ఈ క్రీడోత్సవాల్లో ఆమెకు అవకాశమే దక్కలేదు. కానీ ఒక రేపిస్టును మాత్రం ఆడనివ్వడంపై క్రీడాప్రేమికులు మండిపడుతున్నారు.