మహారాష్ట్రలోని సింధ్‌దుర్గ్ జిల్లాలో అరాచకం వెలుగు చూసింది. సోనుర్లీ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ మహిళను గొలుసులతో బంధించి, చెట్టుకు కట్టేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మహిళ అరుపులు విన్న గొర్రెల కాపరి పోలీసులకు సమాచారం అందించాడు. వారు ఆ ప్రాంతానికి చేరుకుని వెతగ్గా ఓ మహిళను చెట్టుకు కట్టేసిన ఉదంతం వెలుగు చూసింది.
బాధితురాలు తమిళనాడుకు చెందిన లలితా కయీగా పోలీసులు గుర్తించారు. ఆమె వద్ద పాస్‌పోర్టుతోపాటు ఆధార్ కార్డు కూడా లభించింది. పదేళ్లుగా ఆమె తమిళనాడులో ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. లలితా కయీ మాట్లాడే పరిస్థితిలో కూడా లేకపోవడంతో ఆమెను వెంటనే గోవాలోని ఓ ఆసుపత్రికి తరలించారు.
ఆమె బంధువుల ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమెను ఎవరు బంధించి వెళ్లారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఆమె వద్ద ఉన్న వస్తువులు దోచుకుని దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.