ఉత్తరకొరియాను వరదలు ముంచెత్తాయి. పలు పట్టణాలు నీట మునిగాయి. వరద తీవ్రంగా ఉండటంతో దేశంలో ఎమర్జెన్సీ విధించారు. వరదను పరిశీలించేందుకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా కారులో పర్యటించారని తెలిపే కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. వరదలు పరిశీలించేందుకు హెలికాఫ్టర్ వాడాలి కాని కారులో వరదలు ఎలా పరిశీలిస్తారనే విమర్శలు వస్తున్నాయి.
ఉత్తరకొరియాలో గత వారం రోజులుగా కురుస్తోన్న కుండపోత వర్షాలకు సినాంజూ, యిజు పట్టణాలు నీట మునిగాయి. దాదాపు 5 వేల మందిని 10 విమానాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వేలాది మంది నిరాశ్రయులైనట్లు తెలుస్తోంది. ఇక కయిసాంగ్ పట్టణంలో 24 గంటల్లోనే 18 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో నగరం నీట మునిగింది. దేశంలో గడచిన రెండువారాలుగా కుంభవృష్టి కురవడంతో పంటలు దెబ్బతిన్నాయి. దేశంలో ఆహార కొరత ఏర్పడే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.