ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నభోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెడతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. దాంతో డొక్కా సీతమ్మ ఎవరనే కుతూహలం ప్రజల్లో కలుగుతోంది. ఆవిడ సాక్షాత్ అన్నపూర్ణాదేవి స్వరూపమే అని చెప్పుకోవచ్చు. బ్రిటిష్ దొరలు సైతం ఆమె సేవానిరతికి ముగ్ధులయ్యారంటే సీతమ్మ చెయ్యి ఎంత పెద్దదో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటి తరానికి పెద్దగా తెలియని డొక్కా సీతమ్మ గురించి ఒక్కసారి తలచుకుందాం.
డొక్కా సీతమ్మ 1841 అక్టోబరులో తూర్పుగోదావరి జిల్లా మండపేటలో పుట్టారు. ఆమె తల్లిదండ్రులు అనప్పిండి నరసమ్మ, భవానీశంకరం. బాల్యం నుంచీ సీతమ్మకు ఆతిథ్యం ఈయడమంటే మక్కువ. ఇంటికి వచ్చే అతిథులకు సేవలు చేసి, కడుపునిండా భోజనం పెట్టేవారు. 1850లో సీతమ్మను డొక్కా జోగన్న వివాహం చేసుకున్నారు.
లంకల గన్నవరం గ్రామానికి చెందిన జోగన్న, వేదసభల్లో పాల్గొనడానికి వెడుతూ మార్గమధ్యంలో మండపేటలో భవానీశంకరం గారింటిలో బస చేసారు. ఆ సమయంలో సీతమ్మ ఆతిథ్యాన్ని చవిచూసిన జోగన్న ఆమెను పెళ్ళి చేసుకున్నారు. పెద్ద రైతు, ఆర్థికంగా స్థితిమంతుడూ అయిన జోగన్న ప్రోత్సాహంతో వివాహం తర్వాత కూడా సీతమ్మ తన ఆతిథ్యాన్ని, భోజనదాన సేవావ్రతాన్నీ కొనసాగించారు.
గోదావరీ పరీవాహక ప్రాంతంలో ఆ కాలంలో ప్రయాణ సాధనాలు పడవలు మాత్రమే. అలాంటి ప్రయాణికులకు దారి మధ్యలో ఎక్కడా భోజనం దొరికేది కాదు. అలాంటి వారందరికీ లంకల గన్నవరంలో జోగన్న గారి ఇంట్లో చక్కటి ఆతిథ్యం లభించేది. అలా సీతమ్మచేతి భోజనం గురించి విస్తృతంగా ప్రచారమైంది. ఆగొన్నవారికి అడగకుండానే అన్నం పెట్టే అన్నపూర్ణాదేవిగా సీతమ్మ ప్రఖ్యాతురాలైంది. ఎవరు ఏ వేళ వచ్చి భోజనం అడిగినా లేదు అనే మాటే ఆవిడ నోటినుంచి ఏనాడూ రాలేదు. అతిథి అభ్యాగతులకు అన్నం పెట్టలేని పరిస్థితి వస్తుందేమో అని, ఆమె తన ఊరు దాటి ఏనాడూ బైటకు వెళ్ళలేదు.
అప్పటి బ్రిటిష్ పాలకులు, భారతీయ సంస్థానాధీశులూ డొక్కా సీతమ్మను సన్మానాల పేరిట ఆహ్వానించినా ఆ తల్లి సున్నితంగా త్రోసిపుచ్చేవారట. బ్రిటిష్ రాజుగా ఎడ్వర్డ్-7 ప్రమాణస్వీకారానికి భారతదేశం నుంచి ఆహ్వానం అందుకున్న కొద్దిమందిలో సీతమ్మ ఒకరు. ఆమె ఇంగ్లండ్ వెళ్ళకపోతే, ఆమె చిత్రపటం తెప్పించుకుని పట్టాభిషేక సమయంలో దాన్ని సత్కరించారని చెప్పుకుంటారు.
డొక్కా సీతమ్మ 1909 ఏప్రిల్ 28న తుదిశ్వాస విడిచేవరకూ అన్నదానాన్ని నిత్యానుష్ఠానంగా ఆచరించారు. ఆమె సేవలకు గుర్తింపుగా నాటి బ్రిటిష్ ప్రభుత్వం చక్రవర్తి పేరిట ప్రశంసాపత్రాన్నిచ్చింది. లంకల గన్నవరం దగ్గర గోదావరి నదీపాయ వైనతేయ మీద కట్టిన ఆక్విడక్టుకు సీతమ్మ పేరు పెట్టారు. ఆమె జీవితగాధను కొంతకాలం, ప్రాథమిక పాఠశాలల విద్యార్ధులకు పాఠ్యాంశంగానూ బోధించారు.