పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో ఆదివారం నాడు భారత్ ఖాతా తెరిచింది మనూ భాకర్. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్‌లో మూడో స్థానంలో నిలిచి కాంస్యపతకం సాధించింది. ఆ విజయానికి కారణం భగవద్గీత అని మనూ భాకర్ వెల్లడించింది. ఆట ఆడుతున్నంత సేపూ గీతా శ్లోకాలను ఆమె మననం చేసుకుంటూనే ఉంది.
హర్యానాకు చెందిన 22ఏళ్ళ మనూ భాకర్ జులై 28న తన అద్భుత ప్రతిభ కనబరిచి, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 221.7 పాయింట్లు సాధించింది. మొదట్లో కొద్దిగా తడబడినా, క్రమంగా పుంజుకుని టాప్ త్రీలో నిలిచింది. పతకం గెలిచాక మాట్లాడుతూ ఆమె తనకు ప్రేరణగా నిలిచిన భగవద్గీతకు కృతజ్ఞతలు చెప్పుకుంది. ఫైనల్ పోటీలో ఆద్యంతమూ తనకు ఇష్టమైన భగవద్గీత శ్లోకాలను మననం చేసుకుంటూనే ఉన్నానని ఆమె చెప్పింది. భారతదేశానికి ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధించే సామర్థ్యం ఉందని మనూ విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రపంచపు అతిపెద్ద క్రీడోత్సవంలో భారతదేశానికి మొదటి పతకాన్ని సాధించినందుకు ఆమె సంతోషానికి హద్దుల్లేవు.
కేవలం క్రీడలోనే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా తనపై భగవద్గీత ప్రభావం ఎంతో ఉందని మనూ భాకర్ వెల్లడించింది. ‘కర్తవ్యంపైనే దృష్టి కేంద్రీకరించు, ఫలితం గురించి పట్టించుకోకు’ అన్న గీతావాక్యం తనకు స్ఫూర్తి అని చెప్పింది.
2020 టోక్యో ఒలింపిక్స్‌లో పిస్టల్ సరిగ్గా లేకపోవడంతో మనూ భాకర్ పరాజయం పాలయింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్‌లోనే కాదు, ఆ తర్వాత మిక్సెడ్ టీమ్ 10 మీటర్ల, 25 మీటర్ల పోటీల్లో కూడా మనూ భాకర్ దెబ్బ తింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యపతకం గెలుచుకోవడం మనూకు పెద్ద ఊరటనిచ్చింది.