రావూస్ అకాడమీలోకి వరద చేరి ముగ్గురు మరణించిన ఘటన తరవాత ఢిల్లీ స్థానిక ప్రభుత్వం 13 కోచింగ్ కేంద్రాలను సీజ్ చేసింది. ఒక్కసారిగా వరద రావూస్ అకాడమీ భవన సెల్లార్లోకి చొచ్చుకు రావడంతో ఆదివారం నాడు ముగ్గురు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తరవాత తీవ్ర విమర్శలు రావడంతో ఢిల్లీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఢిల్లీలోని ఐఏఎస్ గురుకుల్, చాహల్ అకాడమీ, ప్లూటుస్ అకాడమీ, సాయి ట్రేడింగ్, ఐఏఎస్ సేతు, టాపర్స్ అకాడమీ, డైనిక్ సంవాద్, సివిల్స్ డైలీ ఐఏఎస్, కెరీర్ పవర్, 99 నోట్స్, విద్యా గురు, గైడెన్స్ ఐఏఎస్, ఈజీ ఫర్ ఐఏఎస్ అకాడమీలను సీజ్ చేశారు.
రావూస్ అకాడమీ ఘటనలో సివిల్స్ అభ్యర్థులు తానియా, శ్రేయా యాదవ్, నవీన్ డెల్విన్ ప్రాణాలు కోల్పోయారు. 14 గంటలపాటు కష్టపడి ఫైర్ సిబ్బంది, సెల్లార్లో చిక్కుకుపోయిన మరికొంత మందిని రక్షించారు. అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఢిల్లీ కార్పొరేషన్ సిబ్బంది పట్టించుకోలేదని విద్యార్థులు తీవ్ర ఆందోళనకు దిగారు. దీంతో ఢిల్లీ కార్పొరేషన్ అధికారులు 13 కోచింగ్ కేంద్రాలకు నోటీసులు అంటించి, వాటిని వెంటనే సీజ్ చేశారు.