మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్లో భారత్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. డంబుల్లా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక ఓ మార్పు చేయగా.. భారత్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే బరిలో దింపింది. లంక జట్టులో అచిని కులసూర్య స్థానంలో సచిని నిసంసల చేరారు. సెమీఫైనల్లో భారత్, బంగ్లాదేశ్‌పై విజయం సాధించగా, శ్రీలంక.. పాకిస్తాన్ ను ఓడించి ఫైనల్ కు చేరింది. భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. శ్రీలంక ముందు 166 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
భారత్ 44 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది. ఓపెనర్ షెఫాలీ వర్మ 19 బంతులు ఆడి 16 పరుగులు చేసి ఔట్ కాగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఉమా చైత్రీ(9) కూడా నిరాశపరిచింది. స్మృతి మంధాన మాత్రం సూపర్ ఇన్నింగ్స్ తో అదరగొట్టింది. 47 బంతులు ఆడి 60 పరుగులు చేసిన స్మృతి, ఏకంగా పది ఫోర్లు బాదారు. ఐదో వికెట్ గా స్మృతి పెవిలియన్ చేరింది. ఇక కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 11 బంతుల్లో 11 పరుగులు చేసి ఔట్ అయింది. దీంతో 87 పరుగుల వద్ద భారత్ మూడు వికెట్లు నష్టపోయింది.
జెమీమా రోడ్రిగ్స్ 16 బంతులు ఆడి 29 పరుగులు చే సి రన్ ఔట్ కాగా, వీకెట్ కీపర్ రిచా ఘోష్ 14 బంతుల్లో 30 రన్స్ కొట్టి క్యాచ్ ఔట్ గా పెవిలియన్ చేరింది. పూజా వస్త్రాకర్ (5), రాదా యాదవ్ (1) నాటౌట్ గా నిలిచారు. దీంతో 20 ఓవర్లో భారత్ ఆరు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.
శ్రీలంక బౌలర్లలో కవీష 2 వికెట్లు పడగొట్టగా, సచిని, చమరి, ప్రబోధిని తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.