జగనన్న ఆణిముత్యాలు పథకం ఇక నుంచి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం
ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న పలు పథకాల పేర్లను రాష్ట్రప్రభుత్వం మార్చివేసింది. గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన పేర్లను తొలగించింది. ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారన్నారు. విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతీ నిలయాలుగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి పేరుతో ఏర్పాటు చేసిన పథకాల పేర్లకు స్వస్తి చెబుతున్నామన్నారు. విద్యారంగంలో విశేష సేవలందించిన భరత మాత ముద్దు బిడ్డల పేర్లను ఆయా పథకాలకు పెడుతున్నట్లు తెలిపారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకుని శనివారం నాడు నూతన పథకాల పేర్లను ప్రకటించారు.
గత ప్రభుత్వం హయాంలో అమలైన జగనన్న అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనంగా అమలు చేస్తానని తెలిపిన ఏపీ ఎన్డీయే ప్రభుత్వం,
జగనన్న విద్యా కానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర గా మార్చింది. జగనన్న గోరుముద్ద పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా పేరు పెట్టింది. మన బడి నాడు నేడు స్కీమ్ మన బడి -మన భవిష్యత్తు గా మారింది. స్వేచ్ఛ పథకాన్ని బాలికా రక్ష గా,
జగనన్న ఆణిముత్యాలు పథకాన్ని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం గా రాష్ట్రప్రభుత్వం మార్చింది.
ప్రభుత్వ పథకాలకు స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పథకాలన్నింటికీ జగన్ తన పేరే పెట్టుకున్నారని విమర్శించారు. పథకాలకు మహానీయుల పేర్లు పెట్టడంతో వారి ఆశీస్సులు తమ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉంటాయన్నారు.