మధ్య ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ అకాడమీని వరద ముంచెత్తిన దుర్ఘటనలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై విద్యార్థులు తీవ్ర ఆందోళన చేపట్టారు. రెండు వారాల కిందటే డ్రైనేజీ సమస్య ఉందని అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడం వల్లే వరద ముంచెత్తిందని విద్యార్థులు ఆందోళనకు దిగారు. వరద ఒక్కసారిగా రావూస్ అకాడమీ భవన సెల్లార్‌ను ముంచెత్తింది. దీంతో ముగ్గురు విద్యార్థులు ఊపిరాడక చనిపోయారు. కాసేపట్లోనే వరద నీరు ఏడు అడుగుల మేర సెల్లార్లో చేరిందని ప్రమాదం నుంచి బయటపడిన విద్యార్థులు చెప్పారు.
ఘటన జరిగిన వెంటనే ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ రావూస్ అకాడమీకి చేరుకున్నారు. స్వాతి గో బ్యాక్ అంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. రాజకీయాలు చేయడానికి రాలేదని ఆమె చెప్పారు. అధికారులు, స్థానిక ప్రభుత్వ వైఫల్యంగా ఆమె విమర్శించారు.
ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్నట్లు ఢిల్లీ మేయర్ ఒబరాయ్ తెలిపారు. వరద ఒక్కసారిగా వచ్చిందని చెప్పుకొచ్చారు. సెల్లార్లో అకాడమీలు ఎలా నడుపుతున్నారని అడిగిన ప్రశ్నలకు మాత్రం ఒబరాయ్ సమాధానం ఇవ్వలేదు. చనిపోయిన వారిని తానియా సోని, శ్రేయస్ యాదవ్, నెవిన్ డాల్విన్‌గా గుర్తించారు. సెల్లార్ నీటిని తోడిపోస్తున్నారు. ఇంకా ఎవరైనా ప్రమాదంలో చిక్కుకున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.