దేశంలో పేదరికం నిర్మూలన ద్వారానే 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ సాధ్యమవుతుందని ప్రధాని మోదీ నీతి ఆయోగ్ 9వ సమావేశంలో అభిప్రాయపడ్డారు. శనివారంనాడు రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక మండపంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ అధికారులు, పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు.
ప్రతి గ్రామం అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళికలు అమలు చేయాలని ప్రధాని మోదీ కోరారు. వికసిత్ భారత్ సాధించాలంటే, రాష్ట్రాలు విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో పోటీపడాలని సూచించారు. శాంతి భద్రతలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, వ్యాపార అనుకూల విధానాలు సరళీకరించడం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించవచ్చని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
ఎన్డీయే కూటమి సీఎంలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇండియా కూటమి రాష్ట్రాల సీఎంకు గౌర్హజరయ్యారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరైనా మధ్యలోనే వెళ్లిపోయారు. తన మైక్ కట్ చేశారని మమతా చెప్పారు. అయితే అందులో నిజం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఆమెకు కేటాయించిన సమయం మొత్తం మాట్లాడారని ఫ్యాక్ట్ చెక్ ద్వారా తెలిపారు. నిరసన తెలిపేందుకు నీతి ఆయోగ్ వేదికను కొందరు వాడుకుంటున్నారని నిర్మల విమర్శించారు.