చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై దాడి కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డిని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో చిత్తూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నించిన మోహిత్ రెడ్డిని ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించి చిత్తూరు జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. పులివర్తి నానిపై దాడి ఘటనలో మోహిత్ రెడ్డి ఏ 37గా ఉన్నారు. విదేశాలకు పారిపోకుండా పోలీసులు ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. దీంతో బెంగళూరు ఎయిర్ పోర్టు సిబ్బంది అలర్ట్ అయ్యారు.
మోహిత్ రెడ్డిని శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్న చిత్తూరు జిల్లా పోలీసులు విచారణ జరిపి 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారు. విదేశాలకు వెళ్లడానికి వీళ్లేదని, విచారణకు పిలిచినప్పుడు రావడానికి అందుబాటులో ఉండాలని సూచించారు. కక్షపూరితంగా హత్యాయత్నం కేసులో ఇరికించారని మోహిత్ రెడ్డి వాపోయారు.