కాలిఫోర్నియాలో కార్చిచ్చు : గంటకు 5 వేల ఎకరాలు బుగ్గి
ది పార్క్ ఫైర్ కార్చిచ్చు ఇప్పటికే 5 లక్షల ఎకరాల అడవిని కాల్చి బూడిద చేసింది. మంటలంటుకున్న కారును ఓ వ్యక్తి రోడ్డు పక్క అడవిలోకి దొర్లించడంతో మంటలు వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. కార్చిచ్చు చాలా వేగంగా వ్యాపిస్తూ గంటలకు 5 వేల ఎకరాల అడవిని బుగ్గి చేస్తోందని ఫైర్ సిబ్బంది చెప్పారు.
అమెరికా, కెనడాల్లో ఇటీవల కార్చిచ్చులు ఎక్కువయ్యాయి. ఇప్పటికే 102 కార్చిచ్చులను అదుపు చేశారు. తాజాగా ఈశాన్య చికోలోలో ఏర్పడ్డ కార్చిచ్చును అదుపు చేసేందుకు 2500 మంది సిబ్బంది, 15 హెలికాఫ్టర్లు నిరంతరం పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. అయినా మంటలు అదుపులోకి రావడం లేదన్నారు. మంటలు సుడులు తిరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. మంటలు ఆర్పే ఫైర్ సిబ్బందిని రెట్టింపు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.
2018లో కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చులో వందలాది ఇళ్లు కాలిపోయాయి. 80 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తరవాత ఏర్పడ్డ అతిపెద్ద కార్చిచ్చుగా ది పార్క్ ఫైర్ విస్తరిస్తోందని కాలిఫోర్నియా గవర్నర్ ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి విధించారు.