విశాఖ ఉక్కు కర్మాగారం మరో రికార్డు సొంతం చేసుకుంది. నేటితో 100 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసి రికార్డు క్రియేట్ చేసింది. 1990లో ప్రారంభమైన ఉక్కు ఉత్పత్తి గత ఏడాది నుంచి క్రమంగా తగ్గింది. ఏటా 7.2 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయాల్సి ఉండగా, 2,3 ఫర్నేస్‌లలో ఉత్పత్తి నిలిపేశారు. సొంత గనులు లేకపోవడంతో విశాఖ ఉక్కు ఇటీవల భారీ నష్టాల్లో మునిగిపోయింది. ఓ దశలో విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయబోతున్నారంటూ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు.
ఎన్డీయే 3 ప్రభుత్వం వచ్చిన తరవాత విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లేదని తేల్చడం, బడ్జెట్లో నిధులు కేటాయించడంతో కార్మికుల్లో నమ్మకం పెరిగింది. ఇక విశాఖ ఉక్కు ఉత్పత్తిని పెంచే విషయంలో ప్రధాని మోదీతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని కేంద్ర పరిశ్రమల మంత్రి కుమారస్వామి ఇటీవల ఫ్యాక్టరీని సందర్శించిన సందర్భంలో భరోసా కల్పించారు. ఇప్పటి వరకు విశాఖ ఉక్కు కర్మాగారం రూ. 7 లక్షల కోట్ల విలువైన ఉక్కును ఉత్పత్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు.