నీతి ఆయోగ్ సమావేశంలో మాట్లాతుండగానే తన మైక్ కట్ చేశారంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అర్థంతరంగా వెళ్లిపోయారు. తన మైక్ కావాలనే కట్ చేశారని ఆమె ఆరోపించారు. రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ కేంద్రంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశాలకు పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. ప్రతిపక్షాల నుంచి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరైనా ఆమె నిరసన తెలుపుతూ మధ్యలోనే వెళ్లిపోయారు. కేంద్ర బడ్జెట్లో బెంగాల్‌కు అన్యాయం చేశారని ఆమె ఆరోపించారు.
ఇది తనకు ఒక్కరికే జరిగిన అవమానం కాదని ప్రతిపక్ష పార్టీలు మొత్తానికి జరిగిన అన్యాయంగా మమత అభివర్ణించారు. ఇక జీవితంలో నీతి ఆయోగ్ సమావేశాలకు హాజరయ్యేదే లేదని ఆమె తేల్చి చెప్పారు.
మమత ఆరోపణలను బీజేపీ నేతలు ఖండించారు. కొందరు కావాలనే నీతి ఆయోగ్ సమావేశాలను, నిరసన తెలిపేందుకు వాడుకుంటున్నారని బీజేపీ నేతలు విమర్శలు చేశారు. ఎన్డీయే కూటమికి చెందిన బిహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాలేదు. బిహార్ నుంచి ఉప ముఖ్యమంత్రిని సమావేశానికి పంపించారు.
2047నాటికి భారత్‌ను అభివృద్ది చెందిన దేశంగా మలిచే విషయంపై 9వ నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించారు.