ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేసింది. పలు విమానాశ్రయాల పేర్లు మార్పుకు ప్రతిపాదనలు పంపింది. విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్టుకు నందమూరి తారకరామరావు పేరు సూచించిన ఏపీ ఎన్డీయే ప్రభుత్వం, తిరుపతి ఎయిర్ పోర్టుకు శ్రీ వేంకటేశ్వరుడి పేరును ప్రతిపాదించింది. ఇక ఓర్వకల్లు విమనాశ్రయానికి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెట్టాలని విన్నవించింది.
ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ లోక్సభలో వెల్లడించారు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం వెల్లడించారు.
దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు 22 విమానాశ్రయాల పేర్లు మార్పు కోరుతూ ప్రతిపాదనలు పంపించాయని కేంద్రమంత్రి తెలిపారు. దర్బంగా ఎయిర్పోర్టును విద్యాపతి గా నామకరణం చేయాలని బిహార్ కోరింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, మహారాష్ట్రలు కూడా పలు ఎయిర్ పోర్టుల పేర్లు మార్పుపై ప్రతిపాదనలు పంపాయని కేంద్రమంత్రి వివరించారు.