కృష్ణా, గోదావరి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి నుంచి ధవళేశ్వరం వద్ద 12 లక్షల క్యూసెక్కుల వరద సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇక కృష్ణాలో కూడా వరద ప్రవాహం పెరిగింది. మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురిసిన అతిభారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రస్తుతం 343000 వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. సాయంత్రానికి వరద 4 లక్షల క్యూసెక్కులు దాటే అవకాశముందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 116 టీఎంసీల జలాలున్నాయి. మొత్తం కెపాసిటీ 215 టీఎంసీలు, మరో 99 టీఎంసీలు చేరేందుకు 3 రోజుల సమయం పట్టే అవకాశముంది. మంగళవారం నాటికి శ్రీశైలం పూర్తిగా నిండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా 50 వేల క్యూసెక్కులు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ఇక పోతిరెడ్డిపాడుకు 12 టీఎంసీల నీరు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డులు వినతులు పంపింది.