ప్రపంచ ఫ్యాషన్ రాజధాని పారిస్‌లో 33వ ఒలింపిక్ క్రీడోత్సవాలు రంగరంగవైభవంగా మొదలయ్యాయి. ఈ వేడుకల్లో భారతదేశం నుంచి 117మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. వారు 16 విభాగాల్లో పోటీ పడతారు. 70మంది క్రీడాకారులు, 47మంది క్రీడాకారిణులతో కూడిన భారత బృందం సెన్ నది మీద జరిగిన ప్రారంభోత్సవంలో పాల్గొంది.
మన తెలుగు క్రీడాకారులు పివి సింధు, ఆచంట శరత్ కమల్ మువ్వన్నెల జెండాతో నేతృత్వం వహించగా భారత జట్టు ప్రారంభోత్సవంలో పాల్గొంది. సెన్ నది మీద పడవలో ప్రయాణిస్తూ ఈఫెల్ టవర్ దగ్గరి ప్రారంభోత్సవ వేడుకలు జరిగే ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే ప్రారంభ వేడుకల్లో 78మంది మాత్రమే పాల్గొన్నారు. వివిధ కారణాల వల్ల మిగతా భారతీయ క్రీడాకారులు హాజరవలేకపోయారు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు, మన దేశంలో అత్యధికులు మాట్లాడే హిందీ భాషకు అరుదైన గౌరవం దక్కింది. అక్కడ ప్రదర్శించిన ఆరు భాషల్లో హిందీ కూడా ఒకటి. క్రీడాకారిణుల పట్ల గౌరవసూచకంగా ఏర్పాటు చేసిన బొమ్మలో మహిళల హక్కులు, సాధికారతకు కట్టుబడి ఉన్నామంటూ ఆరు భాషల్లో నినాదాలు రాసారు. ఫ్రెంచ్, ఇంగ్లీష్, మండారిన్, స్పానిష్, హిందీ, అరబిక్ భాషల్లో ఆ నినాదాలు ఉన్నాయి.
ఫ్రాన్స్‌తో భారత్‌కు ఉన్న బలమైన దౌత్య సంబంధాలకు అది నిదర్శనమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. భవిష్యత్ ప్రపంచ రాజకీయాల్లో భారత్ ప్రపంచనేతగా అవతరిస్తుందని ఆనందిస్తున్నారు.