నవీ ముంబై పరిధిలోని షాబాజ్ గ్రామపరిధిలో ప్రమాదం జరిగింది. మూడు అంతస్తుల భవనం కూలింది. బిల్డింగ్ శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. ప్రస్తుతానికి ఇద్దరిని రక్షించారు. మరో ఇద్దరు శిథిలాల కిందే చిక్కుకుపోయరని నవీ ముంబై డిప్యూటీ ఫైర్ ఆఫీసర్ పురుషోత్తమ్ జాదవ్ తెలిపారు. తెల్లవారుజామున 4.50 నిమిషాలకు భవనం కూలినట్లు ఫోన్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. సహాయ చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కైలాశ్ షిండే వెల్లడించారు.
ఈ నెల 20న కూడా ముంబై గ్రాండ్ రోడ్డు ప్రాంతంలోని రుబానా మంజిల్ అనే భవనం కూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 13 మంది గాయపడ్డారు. ముంబైతో పాటు మహారాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వానలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పురాతన భవనాలు కూలడంతో పాటు రోడ్లు ధ్వంసం అయ్యాయి. దీంతో ప్రజారవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జులై 28న మధ్య మహారాష్ట్రకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ముంబై సహా ప్రధాన నగరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి.