ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణశాఖ పేర్కొంది. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ పై ఎలాంటి ప్రభావం చూపే అవకాశంలేదని స్పష్టం చేసింది. రెండ్రోజుల్లో ఇది పశ్చిమ వాయవ్యంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మీదుగా ప్రయాణిస్తుందని వివరించింది.
ఒడిశా మీదుగా తూర్పు, పడమరగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో శుక్రవారం నాడు కోస్తాలో పలుచోట్ల తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వానలు పడ్డాయి. రాయలసీమలో చెదురుమదురు జల్లులు పడ్డాయి. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు.