మనతరం చూసిన యుద్ధం కార్గిల్ యుద్ధం. పాకిస్తాన్ దుర్నీతికి, భారత వ్యతిరేక కుట్రలకు నిలువెత్తు నిదర్శనంగా ప్రపంచం సైతం గుర్తించిన యుద్ధం కార్గిల్ యుద్ధం. ఆయుధాలూ సౌకర్యాల పరంగా ఎన్ని పరిమితులు ఉన్నా, ఎంతటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనైనా, దేశమాత కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి వెనుకాడని వీరోచిత తత్వం భారతీయ సైనికుల సొంతం. కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన అలాంటి మహాయోధులను స్మరించుకుందాం.
కెప్టెన్ విక్రమ్ బాత్రా:
కార్గిల్ యుద్ధంలో షేర్షా అన్న కీర్తి గడించిన వ్యక్తి కెప్టెన్ విక్రమ్ బాత్రా. ఆ యుద్ధానికి వెళ్ళేటప్పటికి ఆర్మీలో అతని సర్వీస్ రెండేళ్ళ కంటె తక్కువే. అతనున్న 13 జమ్మూకశ్మీర్ రైఫిల్స్ బెటాలియన్‌కు పాయింట్ 5140ను స్వాధీనం చేసుకోవాలన్న లక్ష్యం నిర్దేశించారు. దానికి అతను స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. విజయాన్ని చాటడానికి అతను ఎంచుకున్న పాస్వర్డ్ ‘‘దిల్ మాంగే మోర్’’ ఆ తర్వాత విజయగీతమైంది. పాక్ సైనికులు ఎక్కువమంఋది మోహరించిన ఆ ప్రదేశాన్ని బాత్రా బెటాలియన్ ఎంతో శ్రమించి స్వాధీనం చేసుకుంది. ఆ పక్కనే ఉన్న పాయింట్ 4875ను కూడా వెంటనే స్వాధీనం చేసుకోవాల్సిన పరిస్థితి. కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ వైకె జోషి ఆ పరిస్థితి అత్యవసరమని చెబుతూనే మరో బృందాన్ని పంపించాలని భావించారు. అయితే ఆ పాయింట్‌కు తాను అతి చేరువలో ఉన్నాననీ, దాన్నీ తనే స్వాధీనం చేసుకుంటాననీ కెప్టెన్ విక్రమ్ బాత్రా నిర్ణయం తీసుకున్నాడు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి ముందుకు నడిచాడు. పాక్ సైనికుల మెషిన్‌గన్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. రక్తమోడుతూనే బంకర్‌కు పాక్కుంటూ వచ్చి, గ్రెనేడ్ ప్రయోగించి శత్రువులను తుదముట్టించాడు. విక్రమ్ బాత్రా పోరాటం వల్లే పాయింట్ 4875 మీద కాసేపటికే త్రివర్ణపతాకం రెపరెపలాడింది. ఆ ప్రయత్నంలోనే ప్రాణాలు త్యాగం చేసినందున ఆ పాయింట్‌కి ‘‘బాత్రా టాప్’’ అని పేరు పెట్టారు. కెప్టెన్ విక్రమ్ బాత్రాకు మరణానంతరం పరమవీరచక్ర ప్రదానం చేసారు.
లెఫ్టినెంట్ మనోజ్ పాండే:
మనోజ్ పాండే గూర్కా రైఫిల్స్ విభాగంలో చేరిన మొదటి యేడాదిలోగానే కార్గిల్ యుద్ధానికి వెళ్ళాడు. యాల్దార్ సెక్టార్లో జబువార్ టాప్, కాలూబార్ హిల్ మీద పాగావేసిన శత్రువులను హతమార్చాలని అతనికిచ్చిన ఆదేశం. యువకుడైన మనోజ్ తనే స్వయంగా దాడికి నాయకత్వం వహించాడు. చీకట్లో నేరుగా శత్రువు దగ్గరకు వెళ్ళిపోయి నేరుగా తన ఖుక్రీ కత్తితో దాడి చేసాడు. అతని బృందం కొన్నిభాగాలను విముక్తం చేయగలిగింది. కానీ జబువార్ టాప్ మీదకు వారు చేరేసరికి తెల్లవారిపోయింది. భారీ కాల్పుల్లో మనోజ్‌కు చాలా గాయాలయ్యాయి. అయినా అతను దాడిని ఆపలేదు. మనోజ్ పాండే, అతని బృందం సాహసోపేతమైన చర్యల వల్ల కాలూబార్, జబువార్ రెండు ప్రాంతాలనూ భారత్ కైవసం చేసుకుంది. అదే క్రమంలో మనోజ్ పాండే అమరుడయ్యాడు. అతనికి భారత ప్రభుత్వం మరణానంతరం పరమవీరచక్ర పురస్కారం ప్రదానం చేసింది.
గ్రెనేడియర్ యోగేందర్ సింగ్ యాదవ్:
కార్గిల్ యుద్ధంలో 18 గ్రెనేడియర్స్ యూనిట్‌కు టోలోలింగ్ టాప్‌ను స్వాధీనం చేసుకోవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆ యూనిట్‌లోని ఒక సైనికుడే గ్రెనేడియర్ యోగేందర్ సింగ్ యాదవ్. 1999 జూన్ 12న వాళ్ళు దాడి మొదలుపెట్టారు. లీడింగ్ స్కౌట్ యోగేందర్ యాదవ్ నేతృత్వంలోని కమాండో ప్లటూన్ కొండను ఒక పక్కనుంచి తాళ్ళ సహాయంతో ఎక్కింది. పైనుంచి పాక్ సైనికుల కాల్పులను తప్పించుకుంటూ కొసకంటా చేరుకున్నారు. ఆ క్రమంలో ఎన్నో బులెట్ గాయాలైనా, యోగేందర్ పాక్కుంటూ కొండ మీదకు ఎక్కాడు, తన అనుచరులకు ప్రేరణగా నిలిచాడు. యోగేందర్ ప్లటూన్‌లో సగంమందికి పైగా సైనికులు చనిపోయారు. ఐనా యోగేందర్ పట్టు విడవకుండా యుద్ధం కొనసాగించాడు. చివరికి, ఆ ప్లటూన్ విజయం సాధించింది. టోలోలింగ్ టాప్ మీద పాకిస్తానీ సైనికులను తుదముట్టించింది. కార్గిల్ యుద్ధంలో భారత్ మొట్టమొదటి విజయం అది. దాదాపు చనిపోయే స్థితిలో ఉన్న గ్రెనేడియర్ యోగేందర్సింగ్ యాదవ్‌ను విమానమార్గంలో ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్‌కు తరలించారు. అదృష్టవశాత్తు యోగేందర్ బతికాడు. అతన్ని భారత ప్రభుత్వం పరమవీరచక్ర పురస్కారంతో గౌరవించింది.
రైఫిల్‌మ్యాన్ సంజయ్‌కుమార్:
పాయింట్ 4875 మీద దాడికి 13జమ్మూకశ్మీర్ రైఫిల్స్ బృందాన్ని పంపించారు. ఆ బృందానికి లీడింగ్ స్కౌట్లు, సంజయ్‌కుమార్, అతని స్నేహితుడు. ఆ శిఖరం మీదకు వారు ఎగబాకుతుండగా శత్రువులు భారీగా కాల్పులు జరిపారు. సంజయ్ లీడ్ పొజిషన్ తీసుకుని, తన స్నేహితుడికి కవర్ ఇస్తూ అతన్ని కాల్పులు జరపమన్నాడు. ఆ క్రమంలో సంజయ్ భుజానికి గాయమైంది. అయినా ఆగకుండా పైకి పాకుతూనే శత్రువు శిబిరాన్ని చేరుకున్నాడు. అక్కడ శత్రువుతో నేరుగా యుద్ధం చేసి అతన్ని చంపేసాడు. విపరీతంగా రక్తస్రావం అవుతున్నా, మరో శత్రుశిబిరం దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. ఒకపక్క రక్తమోడుతూనే తనపై దాడికి వచ్చిన సంజయ్‌ని చూసి శత్రువు ఆశ్చర్యపోయాడు. అతని దాడిని తట్టుకోలేక ఆ స్థానాన్ని వదిలి శత్రువు పారిపోయాడు. సంజయ్ దగ్గర మందుగుండు అయిపోయింది. శత్రువు వదిలేసిన మెషిన్‌గన్ తీసుకుని, పారిపోతున్న పాకిస్తానీ సైనికులను కాల్చి చంపేసాడు. సంజయ్ చూపిన ఆ ధైర్యసాహసాల కారణంగా పాయింట్ 4875 (దానికే తర్వాత బాత్రా పాయింట్ అని పేరు పెట్టారు) భారత వశమయింది.
మరో పదిమంది ఇన్ఫాంట్రీ బెటాలియన్ సైనికులు కూడా యుద్ధగౌరవాన్ని పొందారు. ‘బ్రేవెస్ట్ ఆఫ్ ది బ్రేవ్’ బిరుదు అందుకున్నారు. కార్గిల్ యుద్ధంలో భారత్‌ను గెలిపించిన మన వీరులకు సెల్యూట్ చేద్దాం. ప్రత్యేకించి, ఆ యుద్ధం నుంచి తిరిగిరాని వీరులకు మనసారా వందనం చేద్దాం. ‘కదనరంగంలో యోధుడి మరణానికి దుఃఖపడకూడదు, వీరస్వర్గం వారిదే’.