అస్సాంను పరిపాలించిన అహోం రాజవంశపు సమాధులు ‘మొయిడామ్స్’ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో సాంస్కృతిక సంపద కేటగిరీలో చేర్చారు. భారతదేశపు రాజధాని ఢిల్లీలో తాజాగా జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాల్లో ఆ నిర్ణయం తీసుకున్నారు.
ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడానికి 27 స్థలాల ప్రతిపాదనలను యునెస్కో పరిశీలిస్తోంది. ఇప్పటివరకూ 124 స్థలాలను ఆ జాబితాలో చేర్చారు. వాటిలో 57 ఇప్పటికే అంతరించిపోయే ముప్పు ఎదుర్కొంటున్నాయి. వాటి పరిరక్షణకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ చర్యలు తీసుకుంటోంది.
ప్రపంచ సాంస్కృతిక, సహజ వారసత్వ సంపద పరిరక్షణకు యునెస్కో ఒప్పందంలో భాగంగా ఏర్పాటు చేసిన రెండు సంస్థల్లో వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఒకటి. ఆ ఒప్పందంపై సంతకం చేసిన 195 దేశాలలోనుంచి ఎన్నికైన 21 దేశాల ప్రతినిధులతో ఆ కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ సమావేశం ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఢిల్లీలో జరిగింది. ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చిన 124 స్థలాల్లో పరిరక్షణ కార్యక్రమాలు ఎలా జరుగుతాయో పరిశీలించింది. వాటిలో 57 స్థలాలు ఇప్పటికే అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయి.
కమిటీ ఇవాళ అంటే జులై 26 నుంచి 29 వరకూ కొత్త స్థలాల ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఈ యేడాది వారసత్వ జాబితాలో చేర్చడానికి 27 స్థలాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. వాటి వివరాలను యునెస్కో అధ్యయనం చేస్తోంది. వాటిని సహజ, సాంస్కృతిక, ఉమ్మడి అనే మూడు కేటగిరీల్లో పరిశీలిస్తున్నారు. ఆ క్రమంలో అస్సాంలోని మొయిడామ్స్ను సాంస్కృతిక సంపద కేటగిరీలో యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చారు.
ఈ సమాచారంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హర్షం వ్యక్తం చేసారు. మొయిడామ్స్ను యునెస్కో జాబితాలో సాంస్కృతిక విభాగంలో చేర్చడం అస్సాంకు గొప్ప విజయమని అభివర్ణించారు. యునెస్కో కమిటీకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, అస్సాం రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసారు.
‘‘చరైదేవ్లోని మొయిడామ్స్ నిగూఢమైన ఆధ్యాత్మిక విశ్వాసాలకు, గొప్ప నాగరికత సాంస్కృతిక వారసత్వానికి, అస్సాంలోని తాయ్-అహోం సామాజికవర్గీయుల నిర్మాణ కౌశలానికీ నిదర్శనం. పైగా ఆ ప్రకటన భారత గడ్డ మీద నుంచి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఎంట్రీకి మరో రెండు విశేషాలున్నాయి. భారతదేశపు ఈశాన్యభాగం నుంచి ఒక స్థలం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో సాంస్కృతిక విభాగం కేటగిరీలో ఎంపికవడం ఇదే మొదటిసారి. కజీరంగా, మానస్ జాతీయ పార్కుల తర్వాత ఇది అస్సాంలోని మూడవ ప్రపంచ వారసత్వ స్థలం. ఈ సందర్భంగా అందరినీ ఆహ్వానిస్తున్నాను. అస్సాం రండి. ఇక్కడి గొప్ప సాంస్కృతిక సంపదను సందర్శించండి’’ అంటూ హిమంత బిశ్వ శర్మ ఎక్స్ సామాజిక మాధ్యమంలో ట్వీట్ చేసారు.
అస్సాంను పరిపాలించిన అహోం వంశపు రాజులు, వారి కుటుంబాల సమాధులను మొయిడామ్స్ అంటారు. మొయిడామ్లు ఎగువ అస్సాంలోని అన్ని జిల్లాల్లోనూ కనిపించినా, ప్రధానంగా అహోంల మొదటి రాజధాని చరైదేవ్లో అహోం రాజవంశీకులు అందరి సమాధులూ ఉన్నాయి. అహోంల మొదటి రాజు చౌ-లంగ్-సియు-క-ఫా మృతదేహాన్ని తాయ్-అహోం సంప్రదాయ ఆచారాల ప్రకారం చరైదేవ్లో ఖననం చేసారు.