ఇథియోపియాలో ఘోరం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు కిన్ చో చాషా గిజిడీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 257 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య 500పైగానే ఉంటుందని ఐక్యరాజ్యసమితి మానవతా సాయ విభాగం తెలిపింది.గురువారంనాడు కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలు జరుగుతున్న సమయంలో మరోసారి కొండచరియలు జారిపడ్డాయి. ఈ ఘటనలో సహాయ కార్యక్రమాల్లో పొల్గొన్న వారు కూడా గల్లంతయ్యారు. గల్లంతైన వారు బతికే అవకాశాలు ఏ మాత్రం లేవని తెలుస్తోంది. పెద్ద ఎత్తున మట్టి జారి పడటంతో దాదాపు 15 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఐరాస తెలిపింది.
ప్రమాదంపై ఇథియోపియా ప్రధాని అబీఅహ్మద్ స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్ణకరమన్నారు. గల్లంతైన వారిని వెతికేందుకు ఐక్యరాజ్యసమితి దళాలు సాయం అందిస్తున్నాయి. ప్రమాద ఘటన ప్రాంతాన్ని ప్రధాని అబీఅహ్మద్ ఇవాళ సందర్శించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.