రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలో ప్రత్యేక మీడియా సమావేశంలో మాట్లాడిన వైఎస్ జగన్, చంద్రబాబు అంటేనే వంచన, తప్పుడు ప్రచారం అని అభివర్ణించారు. అందుకే ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటున్నారని దుయ్యబట్టారు.
సాధారణ బడ్జెట్ అయితే ఎన్నికల హామీలు చూపాల్సి వస్తుందని అందుకే 7 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయిందనే వాదనను చంద్రబాబు మీడియా సమావేశాల్లోనూ, గవర్నర్ ప్రసంగంలోనూ తీసుకొచ్చిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు. ఎన్నికల దగ్గర నుంచి చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా రాష్ట్రం రూ.14 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని ఊదరగొడుతుందన్నారు. ఏపీకి నిజంగా అంత అప్పు ఉందా అని ప్రశ్నించారు. చివరికి గవర్నర్ ప్రసంగానికి వచ్చే సరికి రూ.14 లక్షల కోట్లను కాస్తా రూ.10 లక్షలకు తగ్గించారని చెప్పారు.
జూన్ వరకు తీసుకుంటే ఏపీ ప్రభుత్వం నేరుగా చేసిన అప్పు రూ.5.18 లక్షల కోట్లు అని అన్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాకముందు రూ.1,18,051 కోట్ల అప్పు ఉంటే… 2019లో చంద్రబాబు దిగిపోయే సమయానికి రూ.2,71,798 కోట్లకు చేరిందన్నారు.
ఈ ఏడాది వైసీపీ పాలన ముగిసే సమయానికి ప్రభుత్వ అప్పు రూ.5.18 లక్షల కోట్లుగా ఉందని వైఎస్ జగన్ అన్నారు. వాటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ రుణాలు రూ.1.06 లక్షల కోట్లు, ఇతర రుణాలు రూ.1.23 లక్షల కోట్లు ఉన్నాయన్నారు. మొత్తమ్మీద పూర్తిస్థాయిలో రాష్ట్ర అప్పులు రూ.7.48 లక్షల కోట్లు అని అన్నారు.