తమ పాలనలో పెట్టుబడులకు చిరునామగా నిలిచిన రాష్ట్రం, వైసీపీ హయంలో విధ్వంసానికి గురైందని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2014-19 మధ్య రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించామన్న చంద్రబాబు. రూ.16లక్షల కోట్లకు ఎంవోయూలు కుదుర్చుకున్నామని తెలిపారు. రాష్ట్ర విభజన నుంచి వైసీపీ పాలన ముగిసే వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు.
శ్వేతపత్రం విడుదల సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు, రాష్ట్ర విభజన జరిగినప్పుడు చాలా సమస్యలు వచ్చాయని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలో కొనసాగి ఉంటే 2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు.
అమరావతికి పూర్వ వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేసిన చంద్రబాబు, ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేకంగా నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పాలన గడితప్పిందని చంద్రబాబు అన్నారు. అస్తవ్యస్త విద్యుత్ కొనుగోళ్ల విధానం ద్వారా రూ.12,250 కోట్ల మేర రాష్ట్రంపై అదనపు భారం పడింది. అక్రమ ఇసుక తవ్వకాలతో రూ.7 వేల కోట్ల నష్టం వాటిల్లిందని లెక్కలతో వివరించారు. రూ.9,750 కోట్ల మేర ఖనిజ సంపదను దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 101.16 ఎకరాల మడ అడవులను ధ్వంసం చేస్తే, ఎన్జీటీ రూ.5 కోట్ల జరిమానా విధించిందని గుర్తు చేశారు.
పెట్టుబడిదారుల విశ్వాసం కోల్పోవడంతో పాటు అమరావతి, పోలవరం, శక్తి ఉత్పాదన రంగంలో కాంట్రాక్టులు రద్దయ్యాయయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థత కారణంగా ఒక్క విద్యుత్ రంగంలోనే 1.29 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు.గత ప్రభుత్వం పూర్తిగతా పరిశ్రమలకు వ్యతిరేక విధానం అవలంబచిదని దుయ్యబట్టారు.