సైన్యాన్ని ఆధునికీకరించడానికి, బలోపేతం చేయడానికే అగ్నిపథ్ పథకం ప్రవేశపెట్టినట్లు ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అగ్నిపథ్‌పై ప్రతిపక్షాల వ్యాఖ్యలను తిప్పికొట్టారు. సైనికులకు ఇచ్చే పింఛను భారం తగ్గించుకునేందుకే అగ్నిపథ్ తెచ్చారంటూ విపక్షాలు చేస్తోన్న వ్యాఖ్యలకు ప్రధాని మోదీ ఘాటుగా సమాధానం ఇచ్చారు. కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని ప్రధాని మోదీ ప్రసంగించారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని, బీజేపీ ప్రభుత్వం విజయవంతంగా అమల్లోకి తీసుకొచ్చిందని ప్రధాని గుర్తు చేశారు.
సైన్యంలో సంస్కరణలకు అగ్నిపథ్ ఒక ఉదాహరణ అని ప్రధాని మోదీ గుర్తుచేశారు. సైన్యం అంటే రాజకీయ నాయకులకు పరేడ్‌లు చేయడానికి కాదని నిరూపించామన్నారు. సైన్యం అంటే 142 కోట్ల భారతీయుల విశ్వాసం, రాజకీయ వివాదాలను పక్కనబెట్టి, సైనికుల గౌరవం కాపాడేందుకు ఎన్డీయే సర్కార్ ప్రాధాన్యత ఇస్తుందని ప్రధాని గుర్తుచేశారు.
ఆర్మీలో వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడినవారే, అగ్నిపథ్ పథకం గురించి విమర్శలు చేస్తున్నారని ప్రధాని మోదీ వ్యంగాస్త్రాలు విసిరారు. సైనికుల రక్షణ పట్టని వారు చేస్తున్న విమర్శలకు విలువ లేదన్నారు. కార్గిల్ 25వ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని లడ్డాఖ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. షింకున్ లా టన్నెల్ నిర్మాణ పనులను విర్చువల్‌గా ప్రధాని ప్రారంభించారు. దీని పనులు పూర్తైతే ప్రపంచంలోనే అతి ఎత్తైన టన్నెల్‌గా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు.