కావడి యాత్రా మార్గంలో వ్యాపారులు తమ పేర్లతో కూడిన బోర్డులు తప్పనిసరిగా ఉంచాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపేసిన సంగతి తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వాలంటూ యూపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై యూపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కావడి యాత్రా మార్గంలో తినుబండారాలు అమ్మేవారిపై భక్తులు అనేక ఫిర్యాదులు చేశారని, అందుకే వ్యాపారుల పేర్లు తప్పనిసరిగా ప్రదర్శించాలనే నిర్ణయం తీసుకున్నట్లు యూపీ సర్కార్ వెల్లడించింది.
కావడి యాత్రా మార్గంలో వ్యాపారులు వారి పేర్లు ప్రదర్శించాల్సిన అవసరం లేదని, వారు తయారు చేసిన ఆహారం శాఖాహారమా, మాంసాహారమా అనే వివరాలు ఉంటే చాలని గత సోమవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. హోటల్ ఎవరిది, అందులో ఎవరు పనిచేస్తున్నారనే విషయం అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది.
కావడి యాత్రలో లక్షలాది భక్తులు ఏటా గంగా జలాలను తీసుకెళ్లి శివలింగాలకు పూజలు చేస్తూ ఉంటారు. యాత్రా మార్గంలో ఆహార శాలల్లో మాంసాహారం కూడా తయారు చేస్తున్నారనే ఫిర్యాదులు అందుతున్నాయి. ఆహారశాల నిర్వాహకులు వారి పేర్లతో కూడిన బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని ముజఫరాబాద్ పోలీసు అధికారులు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపివేసిన సంగతి తెలిసిందే.