షిర్డి నుంచి కాకినాడ వెళుతోన్న రైల్లో భారీ దోపిడీ జరిగింది. మహారాష్ట్రలోని లాతూర్ జంక్షన్ వద్ద ప్రయాణీకులు దొంగలను గుర్తించి ఆందోళనకు దిగారు. మొత్తం మూడు బోగీల్లో ప్రయాణీకుల నుంచి బంగారు ఆభరణాలు, మొబైల్స్, బ్యాగులు చోరీ చేసినట్లు ప్రయాణీకులు తెలిపారు.
షిర్డి నుంచి కాకినాడ రైల్లోని మూడు బోగీల్లో ఎక్కువ మంది తెలుగు ప్రయాణీకులే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణీకులు బాగా నిద్రలో ఉన్న సమయంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. దాదాపు రూ.30 లక్షల విలువైన బంగారు, ఆభరణాలు, విలువైన మొబైల్స్ దొంగలు కాజేశారు. ప్రయాణీకులు ఆందోళన చేయడంతో ట్రైన్ ఆపి పారిపోయారని బాధితులు తెలిపారు. రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.