లద్దాఖ్ ద్రాస్ సెక్టార్ లోని కార్గిల్ యుద్ధ అమరవీరుల స్మారకం దగ్గర ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి నేటితో 25 ఏళ్ళు అయ్యాయి. దీంతో ద్రాస్ సెక్టార్‌లో ఉన్న స్మారకం వద్ద ఇవాళ పుష్పగుచ్ఛం అంజలి ఘటించారు. అమర సైనికుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
యుద్ధానికి సంబంధించిన ఫోటోలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. యుద్ధానికి సంబంధించిన జ్ఞాపకాలను సైనికులు మోదీతో పంచుకున్నారు. కొందరు కవితల రూపంలో యుద్ధ విషయాలు వర్ణించారు
కార్గిల్ కొండల తరహాలో నమూనాలు తయారు చేసి ఎగ్జిబిషన్ లో ఉంచారు. పాకిస్తాన్ సైన్యం నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను కూడా ప్రదర్శించారు.
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, దిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళి ప్రకటించారు. ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్ రాజా సుబ్రమణి, నేవీ వైస్ చీఫ్ వైస్ అడ్మిరల్ కే స్వామినాథన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్, సీఐఎస్సీ లెఫ్టినెంట్ జనరల్ జాన్సన్ పీ మాథ్యూ ప్రత్యేక పుష్పగుచ్ఛాలతో నివాళి అర్పించారు.
లక్నోలో సీఎం యోగి ఆదిత్యనాథ్, స్మృతికా వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛాన్ని ఉంచి విజిటర్స్ బుక్‌లో సంతకం చేశారు.