మన తరం చూసిన యుద్ధం కార్గిల్. పాకిస్తాన్ వల్ల భారత్ ఎదుర్కొన్న ఐదో సంక్షోభం. హిమాలయాల్లోని కార్గిల్ కొండల్లో జరిగిన పోరాటం. ‘ఆపరేషన్ అల్ బద్ర్’ పేరుతో పాకిస్తాన్, ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో భారతదేశం తలపడిన సందర్భం. 1993 మే 3న మొదలై 1999 జులై 26 వరకూ అంటే 83 రోజులపాటు జరిగిన సంగ్రామం. వ్యవధి పరంగా చిన్నదే అయినా, తీవ్రంగా జరిగిన ఆ యుద్ధంలో నిర్ణయాత్మక విజయం భారత్ కైవసం అయింది.
అవిభాజ్య జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని లద్దాఖ్ ప్రాంతాన్ని కశ్మీర్, జమ్మూల నుంచి విడగొట్టి ఏకాకిని చేయడం, సియాచిన్ గ్లేసియర్‌ను ఆక్రమించడం, కశ్మీర్‌లోయలోకి ఉగ్రవాదులు చొరబడేందుకు దారిని ఏర్పరచడం అనే లక్ష్యాలతో పాకిస్తాన్ భారత భూభాగంలోని కార్గిల్‌ను ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో యుద్ధం తప్పనిసరి అయింది. 1999 జులై 26న పాకిస్తాన్ తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతో యుద్ధం ముగిసింది. నిజానికి అప్పటికి, ఉపసంహరించుకోడానికి పాకిస్తాన్ బలగాలు పెద్దగా ఏమీ మిగల్లేదు. భారత భూభాగంలోకి చొరబడి కార్గిల్‌ను ఆక్రమించుకున్నవారిలో అత్యధికులను భారత సైనిక బలగాలు మట్టుపెట్టేసాయి. అప్పటికి తప్పించుకున్న కొద్దిమంది ఎంతో కష్టంతో స్వదేశానికి చేరుకున్నారు. అక్కడ వారికి అడుగడుగునా అప్రతిష్ఠ, అవమానాలే ఎదురయ్యాయి.
అప్పటి భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయీ భారత సైనిక బలగాల ధైర్యసాహసాలను, అంకితభావాన్నీ బహిరంగంగానే ప్రశంసించారు. ‘ఆపరేషన్ విజయ్’ ఘనమైన విజయం సాధించిందని ప్రకటించారు. పాకిస్తాన్ సైన్యం నిష్కారణంగా, అన్యాయంగా వాస్తవాధీన రేఖను ఉల్లంఘించి భారత భూభాగంలోకి చొరబడి ఆక్రమించిన ప్రదేశాన్ని కాపాడడంలో భారత సైన్యం అసమాన సాహసాన్ని ప్రదర్శించిందంటూ ప్రశంసల జల్లు కురిపించారు.
పాకిస్తాన్ మోసం, వంచన:
కార్గిల్ కథ ఒక వ్యక్తి చేసిన మోసం, వంచన కథ. ఆ వ్యక్తి అప్పటి పాక్ సైన్యాధిపతి, అనంతరకాలంలో ఆ దేశపు నియంత జనరల్ పర్వేజ్ ముషర్రఫ్. అతను తన వ్యక్తిగత అహాన్ని సంతృప్తిపరచుకోడానికి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు తెలియకుండా ‘ఆపరేషన్ అల్ బద్ర్’ ప్రారంభించాడు. నిజానికి, వాజపేయీ చొరవ చేసి 1999 ఫిబ్రవరి 21న పాకిస్తాన్‌కు బస్సుయాత్ర చేపట్టారు. దానికి కొనసాగింపుగా ఇరుదేశాల మధ్యా సుస్థిర శాంతి కోసం రెండు దేశాల ప్రధానమంత్రులూ లాహోర్ డిక్లరేషన్ మీద సంతకాలు చేసారు. అప్పటికే ముషర్రఫ్ తన ఆపరేషన్ మొదలు పెట్టేసాడు.
ఆ యుద్ధం పాకిస్తాన్ సైన్యపు నాయకత్వం తమ సంస్థకూ, తమ సైనిక బలగాలకూ చేసిన మోసాన్ని కూడా బహిర్గతం చేసింది. తమ సైనికులను బలిపశువులుగా వాడి యుద్ధం చేసిన మూర్ఖుడు ముషర్రఫ్. అప్పటి పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్, నేవీ చీఫ్‌లతో పాటు పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐకి కూడా ఆ ఆపరేషన్ గురించి ఏమాత్రం తెలియదు. ఈ నిర్దిష్ట కారణం కోసమే ముషర్రఫ్ గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో తన భజనపరులైన కొందరు ఆర్మీ జనరల్స్‌ను నియమించాడు. వారు తమ అధికారి అహాన్ని సంతృప్తి పరచడం కోసం ఆ ఆపరేషన్ని చేపట్టారు.
పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ రచయిత అల్తాఫ్ గౌహర్ చెప్పిన వివరాల ప్రకారం… ఈ ఆపరేషన్ నిర్వహణ గురించి ముషర్రఫ్ 1987లోనే ప్రణాళిక సిద్ధం చేసాడు. అయితే అది సైనికపరంగా రక్షించుకోలేనిదీ, అసంబద్ధమైనదీ, అంతర్జాతీయంగా పాకిస్తాన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేదీ అన్న విశ్లేషణతో దాన్ని పక్కన పెట్టేసారు. అప్పటి దేశాధ్యక్షుడు జియా ఉల్ హక్, ప్రధానమంత్రి బేనజీర్ భుట్టో ఇద్దరూ ఆ ప్రణాళికను త్రోసిపుచ్చారు. అదే ప్రణాళికను ముషర్రఫ్ 1998 డిసెంబర్లో అప్పటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డిజిఎంఒ)కు సమర్పిస్తే, ఆయన కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసాడు. దాంతో తనకు సొంతంగా అవకాశం వచ్చినప్పుడు ఆ ప్రణాళికను అమలు చేయాలని ముషర్రఫ్ నిర్ణయించుకున్నాడు.
ఆ ఆలోచనను అమలుచేయడానికి జనరల్ ముషర్రఫ్తో చేతులు కలిపినది అప్పటి పాక్ సైన్యానికి చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ హోదాలో ఉన్న లెఫ్టినెంట్ జనరల్ అజీజ్ ఖాన్, పాకిస్తాన్ 10 కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా వ్యవహరించిన లెఫ్టినెంట్ జనరల్ మహమూద్ అహ్మద్, మేజర్ జనరల్ జావేద్ హసన్. వారిని ‘కార్గిల్ క్లిక్’ అని వ్యవహరించేవారు.
నాసిరకం ప్రణాళిక, అమలు:
కార్గిల్ యుద్ధం గురించి వెలువడి అన్ని పుస్తకాల్లోనూ కనిపించే ఒక ప్రధానాంశం సరైన ప్రణాళిక లేకపోవడం, దాని అమలు కూడా చెత్తగా ఉండడం. ‘కో పైమా’ అనే నెపోలియన్ యుద్ధవ్యూహాన్ని అనుసరించి ఈ ప్రణాళిక రచించారు. శత్రువుల ప్రాంతంలోకి కొద్దికొద్దిగా చొరబడడం, వేగంగా విస్తరించడం, కీలకమైన ప్రదేశాలను ఆక్రమించడం ఆ యుద్ధవ్యూహం లక్షణాలు.
కార్గిల్ క్లిక్ పరిగణనలోకి తీసుకున్న అంశాలు ఒక సాధారణ శీతాకాలం, ఆకస్మిక దాడి, బలహీనమైన భారత్ స్పందన, బలమైన అంతర్జాతీయ జోక్యం, అణుయుద్ధభయం. విచిత్రం ఏంటంటే వారు పరిగణించిన అంశాలేవీ హేతుబద్ధమైన విశ్లేషణకు నిలబడేవి కావు. అయినా ఆ ఆపరేషన్‌ను ముందుకు తీసుకుపోవాలని వారు నిర్ణయించుకున్నారు.
మొదటగా ఈ ఆపరేషన్ కోసం నార్దరన్ లైట్ ఇన్ఫ్యాంట్రీ (ఎన్ఎల్ఐ) సైనికులను పంపించారు. వాస్తవాధీన రేఖను దాటి వ్యూహాత్మకంగా కీలకమైన, ఎత్తయిన ప్రాంతాలను తమ అదుపులోకి తీసుకోడానికి మూడు ఇంట్రూజన్ టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసారు. వాటిలో మొదటిది (టిఎఫ్1) ద్రాస్, ముష్కో సబ్సెక్టార్లోకి చొరబడింది. టిఎఫ్2 లక్ష్యం కక్సర్ ప్రాంతం. టిఎఫ్3 బటాలిక్, యాల్దార్ సబ్సెక్టార్లోకి చొరబడింది.
నార్దరన్ లైట్ ఇన్ఫ్యాంట్రీలో ఉండే సైనికులు ప్రత్యేకంగా పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌కు చెందినవారు. వారు పెద్దగా చదువుకోనివారు. మోటుగా, మొరటుగా, అమాయకంగా ఉండేవారు. వారి పంజాబీ అధికారులు వారిని ఎప్పుడూ చిన్నచూపు చూసేవారు. వారిని ఆ యుద్ధంలో బలిపశువులుగా ఉపయోగించారు.
1999 జనవరి నుంచి, చలికాలం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ఆ సైనికులను భారత భూభాగంలోకి పంపించారు. వారికి సరైన దుస్తులు లేవు, రవాణా ఏర్పాట్లు లేనేలేవు. భారత అంతర్భాగంలోని ఉన్నతమైన ప్రాంతాలను ఆక్రమించడం వారికి నిర్దేశించిన లక్ష్యం. ఒక కెప్టెన్ తన డైరీలో రాసుకున్న వివరాల ప్రకారం వారు చొరబడినప్పుడు ఉష్ణోగ్రతలు మైనస్ 40డిగ్రీలు ఉండేవి. ఒకపక్క భయంకరమైన మంచుతుఫాన్లు, మరోవైపు తీరని ఆకలిదప్పులు, సరిపోని దుస్తులతో నానా అవస్థలూ పడ్డారట. ఏమాత్రం శిక్షణ లేని, ఎటువంటి పరికరాలూ లేని 11మంది సైనికులు భారత్‌లోకి చొరబడే ప్రయత్నంలో చనిపోయారు.
1999 మార్చి 28న పర్వేజ్ ముషర్రఫ్ స్వయంగా తనే, వాస్తవాధీనరేఖ దగ్గరున్న జిక్రియా ముస్తకర్ పోస్ట్‌కు వచ్చి అక్కడినుంచి ఆపరేషన్ని పర్యవేక్షించాడు. 12మంది సైనికులను భారత భూభాగంలోకి పంపించాడు.
భారత నిఘాసంస్థల వైఫల్యం:
పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ప్యూమా హెలికాప్టర్లు వాస్తవాధీన రేఖ వెంబడి తిరుగుతున్నాయని 1999 మార్చి తొలినాళ్ళలో సరిహద్దుభద్రతాదళం (బిఎస్ఎఫ్) నుంచి సమాచారం వచ్చింది. కానీ ఆ సమాచారాన్ని విస్మరించారు. తర్వాత, ఆ ప్రాంతంలోని కొందరు గొర్రెల కాపరులు చొరబాట్లను గుర్తించి సైనిక కమాండర్లకు సమాచారం ఇచ్చారు. కార్గిల్ శిఖర ప్రాంతాల్లో సల్వార్ కమీజులు ధరించిన సాయుధులు కొందరు తిరుగుతున్నారని వారు చెప్పారు.
పాకిస్తాన్ చొరబాటుదార్ల విషయంలో తొలుత వారు ముజాహిదీన్లు అని బుకాయించాలని చూసింది. అయితే మే నెల మొదట్లో ఆ చొరబాటుదారులు పాకిస్తాన్ సైన్యానికి చెందిన, సుశిక్షితులైన సైనికులు అని తెలిసిపోయింది. వాళ్ళు ముష్కో, ద్రాస్, యాల్దార్ ప్రాంతాలను ఆక్రమించారనీ, వారికి తగినంత ఆయుధ సంపత్తి ఉందనీ వెల్లడైంది.
శత్రు బలగాలు అంతపెద్ద సంఖ్యలో కార్గిల్ లాంటి వ్యూహాత్మకంగా కీలకమైన శిఖర ప్రాంతాలను ఆక్రమించగలగడం అతిపెద్ద నిఘావైఫల్యం అని ప్రపంచవ్యాప్తంగా రక్షణరంగ నిపుణులు పరిగణించారు. దానికి భారత్ దగ్గరున్న ఒకేఒక వివరణ, ‘ఆ పర్వతప్రాంతం చాలా సంక్లిష్టమైనది, అక్కడ భారత సైనిక బలగాలు పెద్దఎక్కువగా లేవు’ అని మాత్రమే.
భారత సైన్యపు తక్షణ, తీక్షణ స్పందన:
చొరబాట్ల గురించి స్పష్టత వచ్చేసాక భారతసైన్యం చాలా వేగంగానూ, నిశితంగానూ స్పందించింది. ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకోడానికి, దాడి చేయడానికీ రెండు డివిజన్లను తరలించారు. 155ఎంఎం బోఫోర్స్ గన్స్ కలిగిన ఐదు రెజిమెంట్లు యుద్ధక్షేత్రానికి చేరుకున్నాయి. భారత వైమానిక దళాన్ని ఉపయోగించుకోడానికి ప్రభుత్వం మే 26న అనుమతించింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ పేరిట మిరేజ్ 2000 ఎయిర్‌క్రాఫ్ట్‌లను ప్రయోగించింది. గగనతలం నుంచి చేసే యుద్ధంలో వాటి పనితీరు అద్భుతం.
1999 మే 16న పాయింట్ 4256, పాయింట్ 4440లను 8సిఖ్ బృందం స్వాధీనం చేసుకుంది. పాయింట్ 4480ను 16గ్రెనేడియర్స్ బృందం స్వాధీనం చేసుకుంది. టోలోలింగ్, పాయింట్ 4590 జూన్ 13న స్వాధీనమయ్యాయి. జూన్ 29న పాయింట్ 4760, బ్లాక్ రాక్, మరోమూడు చిన్న ప్రదేశాలూ స్వాధీనమయ్యాయి. టైగర్ హిల్ కోసం యుద్ధం మాత్రం ఎన్నో వ్యయప్రయాసలు, త్యాగాల తర్వాతే గెలవగలిగాం.
భారత బలగాల ధైర్యసాహసాల గాధ:
కార్గిల్ యుద్ధంలో ఎందరో సైనికులు తీవ్రంగా గాయపడ్డారు, చాలామంది ప్రాణత్యాగం చేసారు. భారతదేశపు భద్రత, సమైక్యత కోసమే వారు తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసారు. అత్యంత సంక్లిష్టమైన యుద్ధక్షేత్రంలో, అందనంత ఎత్తులో ఉన్న శత్రువులతో పోరాటంలో వారు చూపిన ధైర్యసాహసాలను కొలవడం అసాధ్యం. ఇవాళ మనం సురక్షితంగా ఉన్నామంటే వారు చేసిన త్యాగాలే కారణం.
ఓటమి ఒప్పుకోలు:
కార్గిల్ యుద్ధంలో పరిస్థితి చేయి దాటిపోవడంతో, సహాయం అర్ధించడం కోసం పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అమెరికాకు పరుగెత్తాడు. అదేరోజు ముష్కో, ద్రాస్ ప్రాంతాలను భారత సైన్యం స్వాధీనం చేసుకుంది, అక్కడకు ఉగ్రవాదుల ముసుగులో చొరబడిన పాక్ సైనికులను ఓడించింది. ఆ ప్రాంతం నుంచి వెనక్కు మళ్ళడానికి పాక్ సైన్యానికి జులై 12 నుంచి 18 వరకూ గడువు ఇచ్చింది. చివరికి జులై 24న వాస్తవాధీన రేఖ యథాతథ స్థితి పునరుద్ధరించబడింది. 1999 జులై 26న భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయీ భారతదేశం కార్గిల్ యుద్ధంలో సంపూర్ణ విజయం సాధించిందని, ఆపరేషన్స్ అన్నీ ముగిసాయనీ ప్రకటించారు.
కార్గిల్ యుద్ధంలో విజయం చాలా ఖరీదైనది. 22మంది ఉన్నతాధికారులు, 21మంది జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, 452మంది సైనికులు తమ ప్రాణాలను దేశమాత కోసం త్యాగం చేసారు. పాకిస్తాన్ వైపు మృతుల సంఖ్య వేలల్లో ఉంది. నవాజ్ షరీఫ్ చెప్పిన లెక్క ప్రకారం సుమారు 4వేల మంది పాకిస్తానీ సైనికులు మరణించారు.
ఉపసంహారం:
పాకిస్తాన్ సైనిక, రాజకీయ వ్యవస్థల మధ్య అసమతౌల్యం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. నిజానికి ఇప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వరుసగా ప్రధానమంత్రులుగా పనిచేసినవారందరూ సైన్యం చేతిలో తోలుబొమ్మల్లా మారిపోయినవారే. మతఛాందస ఉగ్రవాద యుద్ధపిపాసులందరూ భారతదేశానికి వ్యతిరేకంగా కూటమి కట్టడంతో పరిస్థితులు ఇప్పుడు మరింత దారుణంగా ఉన్నాయి.
యుద్ధంలో విజయం సాధించినందుకు వేడుకలు చేసుకోవడం సరే, అదే సమయంలో శత్రువు చర్యలను ఎదుర్కోడానికి భారత సైన్యం సంసిద్ధంగా లేదన్న సంగతిని కూడా మనం గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. కార్గిల్ యుద్ధంలో నిఘావ్యవస్థ వైఫల్యం స్పష్టంగా ఉంది. ఇక భారత సైన్యానికి కూడా బోలెడన్ని సమస్యలున్నాయి. అప్పటి భారత ఆర్మీచీఫ్ జనరల్ విపి మాలిక్ ‘‘మా దగ్గర ఉన్నవాటితోనే మేం యుద్ధం చేస్తాం’’ అని, లోటుపాట్ల గురించి చెప్పారు.
కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన మూడు రోజుల్లోనే భారత ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అసలు యుద్ధానికి దారితీసిన సంఘటనల క్రమం ఏమిటో పరిశీలించి, భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా ఎదుర్కోడానికి తగిన సిఫారసులు చేయాలన్నది ఆ కమిటీకి నిర్దేశించిన లక్ష్యం. కార్గిల్ రివ్యూ కమిటీ (కెఆర్‌సి) అప్పటి పరిణామాలను విస్తృతంగా అధ్యయనం చేసి, సమీక్షించి, భవిష్యత్తులో అలాంటి సంఘటనలు జరగకుండా నివారించడానికి తీసుకోవలసిన చర్యల గురించి విస్తారంగా సిఫారసులు చేసింది. దురదృష్టవశాత్తూ, కార్గిల్ యుద్ధం జరిగి పాతికేళ్ళు గడిచిపోయినా నేటికీ ఆ సిఫారసులు పూర్తిగా అమలుకు నోచుకోలేదు. దేశభద్రత, రక్షణకు సబంధించిన విషయాల్లో అలాంటి ఆలస్యం దేశానికే మంచిది కాదు.
కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాలైంది. రాజకీయ అహాలు, సంకుచిత దృక్కోణాలను పక్కన పెట్టి జాతి కోసం ఆలోచించాల్సిన సమయమిది. కార్గిల్ యుద్ధవీరులు, అమరులపై ప్రశంసలు కురిపించడం సరే, ఇప్పుడు దేశసేవలో ఉన్న సైనికులకు దేశాన్ని రక్షించడానికి వారికేం కావాలో అవి అందే ఏర్పాట్లు చేయాలి. సైనికుల నైతికస్థైర్యాన్ని పరిరక్షించడం దేశ బాధ్యత.