కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 25ఏళ్ళు అయిన సందర్భంగా దేశం ఇవాళ విజయ్‌దివస్ రజతోత్సవం జరుపుకుంటోంది. ఆ సందర్భంగా ఆనాటి యుద్ధంలో అమరులైన సైనికుల కుటుంబాలు వారికి నివాళులు అర్పించాయి. ద్రాస్ సెక్టార్‌లోని కార్గిల్ స్మారకం దగ్గర ఆ కార్యక్రమం ఈ ఉదయం జరిగింది.
ఆ కార్యక్రమంలో పాల్గొన్న పరమవీరచక్ర పురస్కార గ్రహీత మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్, ‘‘దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరజవాన్లను చూసి దేశప్రజలు గర్వపడుతున్నారు. ఆ వీరయోధులకు నివాళులర్పించడం కోసం మేమంతా ఇక్కడకు వచ్చాం’’ అని చెప్పారు.
సుబేదార్ మేజర్ ఆర్‌టి రయాస్ అహ్మద్ మాట్లాడుతూ ‘‘కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పించడానికి మేం గత మూడేళ్ళుగా వస్తున్నాం. మన ఆర్మీ రోజురోజుకూ బలోపేతం అవుతోంది. 25వ విజయ్‌దివస్ సందర్భంగా, దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులందరినీ తలచుకుంటున్నాం. ప్రధాని మోదీ ఇవాళ ఇక్కడకు రానుండడం సైనిక బలగాల నైతికస్థైర్యాన్ని మరింత పెంచుతుంది’’ అన్నారు.
ఇండియన్ నేవీకి చెందిన సీనియర్ అధికారి అనంత్ జోషి ‘‘కార్గిల్ యుద్ధంలో 527మంది భారత సైనికులు మాతృభూమి కోసం ప్రాణత్యాగం చేసారు. వారంతా యువకులే, ఎంతో భవిష్యత్తు ఉన్నవారే. వారినుంచి ఇవాళ్టి తరం ఎంతో నేర్చుకోవాలి’’ అన్నారు.
పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి చొరబడుతున్నవారిని మొదట చూసి, ఆ సమాచారాన్ని భారత సైన్యానికి అందించిన వ్యక్తి తాషీ నాంగ్యాల్. ‘‘ఆ సమయంలో నేను ఆరుగురు వ్యక్తులను బైనాక్యులర్స్‌తో చూసాను. నాకు కనిపించిన విషయాన్ని మన సైన్యానికి చెందిన పంజాబ్ యూనిట్‌కు తెలియజేసాను’’ అని చెప్పారు.
ఇవాళ ద్రాస్‌లోని కార్గిల్ స్మారకం దగ్గర జరిగే 25వ విజయ్‌దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొంటారు. దాంతో ఆ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసారు.
1999 జులై 26న భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ పేరిట పాకిస్తాన్ నుంచి చొరబడుతున్న వారి సైనికులు, ఉగ్రవాదులతో యుద్ధం చేసి, పాక్ ఆక్రమించిన, వ్యూహాత్మకంగా ప్రాధాన్యం కలిగిన, మన భూభాగాలను మళ్ళీ సాధించుకోగలిగింది.