బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో బంగారం దిగుమతిపై సుంకాలను 15 నుంచి ఒకేసారి 6 శాతానికి తగ్గించడంతో కిలో బంగారం దిగుమతిపై రూ.7 లక్షలకుపైగా ధర తగ్గింది. బడ్జెట్ తరవాత కూడా అంతర్జాతీయ మార్కెట్లో బులియన్ ధరలు భారీగా దిగివచ్చాయి. తాజాగా ఔన్సు ఫ్యూర్ గోల్డ్ 2374 అమెరికా డాలర్లకు దిగివచ్చింది. గడచిన మూడు రోజుల్లోనే బంగారం 10 గ్రాములకు రూ.5 వేలకుపైగా తగ్గింది.
తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.70400కు దిగివచ్చింది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ 10 గ్రాములకు రూ.64000కు దిగివచ్చింది. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కిలో రూ.94 వేల నుంచి వారంలో రూ.84వేలకు దిగివచ్చింది. కిలో వెండి మూడు రోజుల్లో రూ.5 వేలకుపైగా తగ్గింది.
అమెరికా జీడీపీ, వడ్డీ రేట్లు, వ్యక్తిగత వినియోగ సూచీల ఫలితాల ఆధారంగా భవిష్యత్ బంగారం ధరల్లో కదలికలు ఉంటాయని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.