ఒలింపిక్స్ క్రీడలు మొదలవడానికి ముందే భారత విలుకాళ్ళు తమ ప్రతాపం చూపించారు. నిన్న గురువారం జరిగిన పోటీల్లో భారత ఆర్చర్లు పురుషుల, స్త్రీల విభాగాలు రెండింటిలోనూ అదరగొట్టి, నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఒలింపిక్స్‌లో మొదటిసారి ఆడుతున్న బొమ్మదేవర ధీరజ్, అంకితా భకత్ వ్యక్తిగత రౌండ్లలో అద్భుతంగా ఆడి తమ జట్లను క్వార్టర్స్‌లోకి దూసుకెళ్ళేలా చేసాడు.
తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ పురుషుల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్‌లో గొప్పగా రాణించాడు. ప్రపంచకప్‌లో కాంస్యపతకం గెలుచుకున్న ధీరజ్ ఒలింపిక్స్ ఈవెంట్‌లో 681 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచాడు. తరుణ్‌దీప్‌రాయ్ 674 పాయింట్లతో 14వ స్థానంలోనూ, ప్రవీణ్ జాదవ్ 658 పాయింట్లతో 39వ స్థానంలోనూ నిలిచారు. మొత్తంగా ముగ్గురూ కలిసి 2013 పాయింట్లు సాధించారు. ఫలితంగా భారతజట్టు మూడవ స్థానానికి చేరుకోగలిగింది. 2049 పాయింట్లు సాధించిన కొరియా జట్టు నెంబర్ వన్‌గా నిలిచింది. 2025 పాయింట్లతో ఫ్రాన్స్ రెండో స్థానంలో ఉంది.
మహిళల విషయానికి వస్తే వ్యక్తిగత రికర్వ్ ఆర్చరీ క్వాలిఫయింగ్ రౌండ్స్‌లో అంకితా భకత్ 666 పాయింట్లు సాధించి 11వ స్థానం సాధించింది. భజన్ కౌర్ 559 పాయింట్లతో 22వ స్థానంలోనూ, దీపిక 558 పాయింట్లతో 23వ స్థానంలోనూ నిలిచారు. భారత మహిళల జట్టు మొత్తంగా 1983 పాయింట్లు సాధించి నాలుగవ స్థానం దక్కించుకుంది.
క్వాలిఫయింగ్ రౌండ్స్‌లో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశిస్తాయి. భారత పురుషుల, మహిళల జట్లు రెండూ అలా క్వార్టర్స్‌ను నేరుగా అర్హత సాధించాయి. 5 నుంచి 12 స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్స్‌లోని మిగతా స్థానాల కోసం రౌండాఫ్ సిక్స్‌టీన్‌లో పోటీ పడాల్సి ఉంటుంది.
మరోవైపు, భారత జట్టులో ఉత్తమ ప్రదర్శన చేసిన ధీరజ్, అంకిత కలిసి ఐదో సీడెడ్ ఆటగాళ్ళుగా మిక్సెడ్ టీమ్ విభాగంలో ఆడతారు.