‘బిజెపి తమిళనాడు అధ్యక్షుడు కె అన్నామలై తాజాగా ‘డిఎంకె క్రైమ్ ఫైల్స్’ విడుదల చేసారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు డిఎంకె ఫైల్స్ 1, 2 విడుదల చేసిన అన్నామలై ఇప్పుడు ఆ పార్టీకి చెందిన వ్యక్తుల నేరచరిత్రలను బహిర్గతం చేసారు. జులై 22న కోయంబత్తూరులో మీడియా సమక్షంలో అన్నామలై రిలీజ్ చేసిన ఆ జాబితాలో డిఎంకె పార్టీ సభ్యులు రాష్ట్రంలో పాల్పడిన నేరాల చిట్టా ఉంది.
అన్నామలై విడుదల చేసిన 18 పేజీల పత్రంలో 2021 సెప్టెంబర్ నుంచి 2024 జులై 5 వరకూ జరిగిన 113 ఘటనల వివరాలున్నాయి. వాటిలో నేరాలకు పాల్పడినవారి పేర్లు, తేదీలు, పార్టీలో వారి వివరాలూ ఉన్నాయి. తమిళనాడులో డిఎంకె పాలనలో పెరిగిపోతున్న నేరాలను, అధికారాన్ని అడ్డంపెట్టుకుని డిఎంకె సభ్యులే ఆ నేరాలకు పాల్పడిన వైనాలనూ నిందితుల చిత్రాలతో సహా వివరించారు.
‘డిఎంకె’ క్రైమ్ ఫైల్స్‌లో ఆ పార్టీకి చెందిన ప్రముఖులు చాలామందే ఉన్నారు. డిఎంకె ఎన్ఆర్ఐ విభాగంలో పనిచేసిన జాఫర్ సాదిక్ అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో నిందితుడు. ఇంకా ఆ పార్టీ ప్రధాన వక్తలు శివాజీ కృష్ణమూర్తి, ఎంపీలు ఎ రాజా, కళానిది వీరాస్వామి, మంత్రి ఎస్ఎస్ శివశంకర్ పేర్లు కూడా ఉన్నాయి. వారందరిపైనా కేంద్ర సంస్థల విచారణ కొనసాగుతోంది. ఇటీవల తమిళనాట సంచలనం సృష్టించిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు కె ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్న అరుళ్, ఎం శ్రీనివాసన్, సతీష్ గురించి కూడా ఆ ఫైల్స్‌లో ఉన్నాయి. వారు ముగ్గురికీ డిఎంకెతో సంబంధాలున్నట్లు సమాచారం.
ఈ జాబితా సమగ్రం కాదనీ, ఇంకా పలువురు డిఎంకె నాయకులు, కార్యకర్తలకు రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న నేరాలతో సంబంధాలున్నాయనీ బీజేపీ ఆరోపిస్తోంది.