ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో శాంతి, భద్రతలు క్షీణించాయని సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో శాంతి, భద్రతలపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. వచ్చే ఐదేళ్లలో శాంతి, భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఎన్డేయే కూటమి నేతలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచన చేశారు. తప్పు ఎవరు చేసినా వదిలేదని లేదన్నారు.
2019 వరకు తనపై బాబ్లీ ప్రాజెక్టు సందర్శన సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసు ఒకటే ఉండేదని, గడచిన ఐదేళ్లలో తనపై 17 కేసులు పెట్టారని ఆయన గుర్తుచేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై 7 కేసులు, జేసీ దివాకర్‌రెడ్డిపై 61 కేసులు పెట్టారని చంద్రబాబు గుర్తుచేశారు. నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణమ రాజును పోలీసులతో చిత్రహింసలకు గురిచేసి, ఆ వీడియోలు చూసి జగన్‌రెడ్డి పైశాచిక ఆనందం పొందాడని చంద్రబాబు విమర్శించారు.
శాంతి, భద్రతలపై మరోక రోజు కూడా సభలో చర్చ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలను చంద్రబాబు అంగీకరించారు. సోషల్ మీడియా కట్టడికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యంగా పోస్టులు పెడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.