తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామం తెలుగు ప్రజలందరికీ సుపరిచితమే. వీసాల బాలాజీగా పేరున్న వెంకటేశ్వరస్వామి గుడి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజాదరణ కలిగిన ఆలయం. ఆ ఆలయం సమీపంలో ఇటీవల పడగొట్టిన ఒక నిర్మాణాన్ని మసీదు అని చెబుతూ ముస్లిములు గొడవ మొదలుపెట్టారు. ఆ ప్రాంతాన్ని ఆక్రమించి, మసీదు కట్టేందుకు సిద్ధపడడంతో రెండురోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
జులై 21న చిలుకూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన స్థలంలో ఒక కొత్త ప్రాజెక్టు చేపట్టడం కోసం తన భూమిని చదును చేయించాడు. ఆ క్రమంలో ఆ స్థలంలో ఉన్న ఒక పాత నిర్మాణాన్ని పడగొట్టించాడు. అంతే. అది పాత మసీదు అంటూ
ముస్లిములు గొడవ మొదలుపెట్టారు. అయితే అది ఏ మతానికి చెందిన నిర్మాణమూ కాదనీ, వాడుకలోలేని గుర్రాలశాల అనీ స్థానిక ప్రజలు చెబుతున్నారు.
అక్కడి ముస్లిములు, తమ మసీదును ధ్వంసం చేసేసారని ఆరోపిస్తూ ఎంఐఎం నాయకులను ఆశ్రయించారు. ఎంఐఎం ఎంఎల్‌సి రహమత్ బేగ్, మైనారిటీ సంక్షేమ విభాగం ముఖ్యకార్యదర్శి తఫ్సీర్ ఇక్బాల్, రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం… సోమవారం నాడు ముస్లిములు వక్ఫ్ బోర్డ్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఎంఎల్‌సి రహమత్ బేగ్, తెలంగాణ ముస్లిం మైనారిటీ సంస్థ అధ్యక్షుడు ఫహీమ్ ఖురేషీ, వందలమంది ముస్లిములు పడగొట్టిన నిర్మాణం దగ్గర చేరి నమాజులు మొదలుపెట్టేసారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ముస్లిం నాయకులతో చర్చలు ప్రారంభించారు. ఆలోగా, శాంతిభద్రతలను పరిరక్షిణ కోసం పోలీసు బలగాలను భారీగా మోహరించారు. ఆ రాత్రి అంతా ముస్లిములు అక్కడే ఉండిపోయారు. స్థానిక తహసీల్దారు గౌతమ్ కుమార్ పరిస్థితిని సమీక్షించారు.
మంగళవారం ఉదయం వక్ఫ్‌బోర్డ్ అధికారులు, పోలీసుల పర్యవేక్షణలో రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతాన్ని సర్వే చేసారు. అక్కడ నాలుగు కుంటల స్థలం వక్ఫ్‌బోర్డుదని తేల్చారు. ప్రస్తుతం వివాదానికి కారణమైన భూమి సర్వే నెంబరు 134లోని 15.34 ఎకరాల భూమి. దాన్ని ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ 133లోని 0.04 కుంటలను వక్ఫ్ భూమిగా ఉంది. అయితే ఆ భూమి వక్ఫ్ భూమి అనడానికి చట్టబద్ధమైన ఆధారాలేమీ స్పష్టంగా లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆ ప్లాట్ నాలుగువైపులా ‘ల్యాండ్లాక్డ్’గా ఉంది. దానికి ఎటువైపు నుంచీ దారి లేదు. ఆ ప్రాంతంలో ముస్లిములకు సంబంధించిన మరే ఇతర చిహ్నాలూ లేవు. అలాంటి చోట వక్ఫ్ఆస్తి ఎక్కడినుంచి వచ్చిందన్న సందేహాలు కలుగుతున్నాయి.
ఆ నేపథ్యంలో మంగళవారం రోజంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చిలుకూరు గ్రామస్తులతో పాటు బిజెపి, బజరంగ్దళ్, ఆర్ఎస్ఎస్ తదితర హిందూ సంస్థల ప్రతినిధులు అక్కడకు చేరుకున్నారు. చిలుకూరు బాలాజీ ఆలయం దగ్గరి మెయిన్‌రోడ్ మీద మంగళవారం రాత్రి వరకూ ఆందోళన నిర్వహించారు. అక్కడ పడగొట్టింది పాత గుర్రాలశాలనే తప్ప మసీదును కాదంటూ, ఆ ప్రాంతంలో ఎలాంటి కొత్త నిర్మాణాలూ చేయరాదంటూ నినాదాలు చేసారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ మసీదు కట్టకూడదని డిమాండ్ చేసారు.
అసలు ఆ గ్రామంలో, నాలుగువైపులా వేర్వేరు స్థలాలు ఉండి, ఎటునుంచీ దారిలేని స్థలాన్ని వక్ఫ్ ఆస్తిగా ఎలా తీర్మానించేసారని చిలుకూరు గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. అటువంటి మార్కింగ్ పొరపాటా లేక అక్కడి భూమిని ఆక్రమించడానికి పన్నిన పన్నాగమా అని అనుమానిస్తున్నారు. సరైన దారే లేని అలాంటి స్థలాన్ని మతపరమైన అవసరాలకు ఉపయోగించే అవకాశాలు దాదాపు లేవని చెబుతున్నారు.
ఆ భూమి యజమాని తన స్థలాన్ని చదును చేయించుకునే క్రమంలో పక్క స్థలంలోకి చొరబడి ఉండవచ్చన్న వాదనలూ వినిపిస్తున్నాయి. చిత్రమేంటంటే పడగొట్టిన నిర్మాణం ఎక్కడుందో ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఐనప్పటికీ వక్ఫ్ బోర్డ్ ఆ స్థలం తమదేనంటోంది. పైగా, ఈ గొడవ మొదలయ్యాక సదరు రియల్ఎస్టేట్ వ్యాపారి కనిపించడంలేదు.
మంగళవారం రాత్రి మళ్ళీ పెద్దసంఖ్యలో ముస్లిములు ఆ ప్రదేశం దగ్గర చేరుకుని నమాజ్ చేసారు. వివాదాస్పద స్థలంలో మసీదు కట్టాలంటూ డిమాండ్ చేసారు. అంతేకాదు, పోలీసు రక్షణ మధ్య అక్కడ ఒక బోర్వెల్ కూడా తవ్వారు.
గ్రామస్తులు ఆ చర్యపై మండిపడుతున్నారు. ట్రెస్పాసింగ్ గొడవని వక్రీకరించి అక్కడ మసీదును ధ్వంసం చేసినట్లు చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అదంతా ఆ భూమిని ఆక్రమించుకోడానికి, చిలుకూరులోని మతసామరస్య వాతావరణాన్ని చెడగొట్టడానికీ పన్నిన కుట్రగా అనుమానిస్తున్నారు.
చిలుకూరులోని వెంకటేశ్వరస్వామి దేవాలయానికి 500 ఏళ్ళ ప్రాచీనమైన చరిత్ర ఉంది. ప్రతీరోజూ వేలసంఖ్యలో భక్తులు అక్కడికి వెడుతూ ఉంటారు. అలాంటి హిందువుల పుణ్యక్షేత్రం పరిధిలో హైందవేతర మతాలకు చెందిన నిర్మాణాలు చేయకుండా చూడాలని పోలీసులు, రెవెన్యూ అధికారులను హిందువులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై విశ్వహిందూ పరిషద్ తెలంగాణ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ శశిధర్ స్పందించారు. ‘‘ఖాళీగా ఉన్న స్థలాలను వక్ఫ్ ఆస్తుల పేరిట ఆక్రమించేందుకు పెద్ద కుట్ర జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఎప్పటినుంచో వాడుకలో లేని గుర్రాలశాల వక్ఫ్‌బోర్డ్ ఆస్తి ఎలా అయింది? తెలంగాణలో ముస్లిముల పాలనా సమయంలో ఎన్నో పవిత్రమైన, ప్రఖ్యాతమైన దేవాలయాలు దురాక్రమణలకు గురయ్యాయి. అలంపురం, వేములవాడ, ధర్మపురి మందిరాల దగ్గర అటువంటి ఆక్రమణలు మన కళ్ళముందే ఉన్నాయి. ఒక ట్రెస్పాసింగ్ గొడవను అవకాశంగా మలచుకుని అసాంఘిక శక్తులు మతపరమైన అంశంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాయి. ముస్లిములు ఇప్పటికిప్పుడే వక్ఫ్ ఆస్తిగా గుర్తించిన స్థలం పక్కనున్న స్థలాన్ని ఆక్రమించేసి అక్కడ బోర్వెల్ తవ్వేసారు’’ అని ఆందోళన వ్యక్తం చేసారు.
చిలుకూరు దివ్యక్షేత్రం పవిత్రతను కాపాడడానికి, ఆ ప్రాంతంలో ఎలాంటి కొత్త మతపరమైన నిర్మాణాలూ చేయకుండా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తక్షణం చర్యలు తీసుకోవాలని విశ్వహిందూపరిషద్ కోరింది.
అక్కడ నాలుగు కుంటల స్థలం తమదంటూ వక్ఫ్ బోర్డ్ ప్రకటించేసింది. అయితే భౌగోళిక వాస్తవాలు ఆ ప్రకటనమీద అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఆ ప్రాంతపు చరిత్రను, పరిస్థితులనూ అధికారులు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఆ భూమి కొలతలు, దాని పరిసరాల పరిస్థితులను పరిశీలించి, వక్ఫ్‌బోర్డ్ ప్రకటించుకున్న యాజమాన్యాన్ని మళ్ళీ సరిగ్గా అంచనా వేయించాలని విహెచ్పి డిమాండ్ చేసింది.
ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో ‘స్టేటస్ కో’ అమలు చేస్తున్నామనీ, వివాదాస్పద స్థలంలో ఎలాంటి కొత్త నిర్మాణమూ చేయకుండా ఆపివేసామనీ డీసీపీ శ్రీనివాస్ తెలియజేసారు.