కృష్ణా, గోదావరి నదులకు వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 14 లక్షల క్యూసెక్కుల వరద సముద్రంలోకి వదులుతున్నారు. 2వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణా నది వరద కూడా పెరుగుతోంది. ఆల్మట్టి నుంచి భారీగా వరద నీరు శ్రీశైలం చేరుతోంది. ఇప్పటికే కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర జలాశయాలు పూర్తిగా నిండాయి. దీంతో ఆయా ప్రాజెక్టులకు వచ్చిన వరదను విడుదల చేస్తున్నారు.
ఆల్మట్టి నుంచి 2 లక్షల క్యూసెక్కులు జూరాలకు విడుదల చేశారు. జూరాలలో అన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా 25 వేల క్యూసెక్కులు, 41 గేట్లు ఎత్తివేయడం ద్వారా 172000 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 197000 క్యూసెక్కుల వరద చేరుతోంది. శ్రీశైలం డ్యాం మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ఇప్పటికే 80 టీఎంసీల జలాలు చేరాయి. 885 అడుగులకు 849 అడుగుల నీరు చేరింది.
తుంగభద్ర నుంచి వరద నీటిని విడుదల చేశారు. తుంగభద్ర ప్రాజెక్టుకు 84 వేల క్యూస్కెల వరద వస్తోంది. డ్యాం 10 గేట్లు ఎత్తి 22వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇదే వరద కొనసాగితే నాలుగు రోజుల్లో శ్రీశైలం పూర్తిగా నిండనుంది. ఇవాళ సాయంత్రానికి ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేపట్టేందుకు ఇంజనీర్లు సిద్దం అవుతున్నారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అయితే నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద చేరనుంది.