భారత సైనిక బలగాలు వీరోచితంగా పోరాడి గెలిచిన గొప్ప యుద్ధం కార్గిల్ యుద్ధం. 1999లో జమ్మూకశ్మీర్‌లోని కార్గిల్ ప్రాంతంలోకి చొరబడిన పాకిస్తానీ సైనికులపై యుద్ధం చేసి, భారత సైన్యం ఆ దేశాన్ని ఓడించింది. ఆ విజయం సాధించి రేపటికి పాతికేళ్ళవుతోంది.
కార్గిల్ విజయ్‌దివస్ రజతోత్సవం సందర్భంగా భారత సైన్యం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. వాటిలో భాగంగా, అందరూ మహిళలతో 16 రోజుల మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించింది. లెహ్ నుంచి మొదలుపెట్టి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశాలైన ఖార్డుంగ్ లా, ఉమ్లింగ్ లా కనుమల మీదుగా, ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన లద్దాఖ్ దారి నుంచి కార్గిల్ వరకూ ఆ ర్యాలీ సాగింది.
భారతీయ సైనికుల అకుంఠిత దీక్షకు, పోరాట పటిమకు నివాళిగా ఆ ర్యాలీ నిర్వహించారు. అంతేకాదు, సాహసాల విషయంలో పురుషులకు మహిళలు దీటుగా నిలబడగలరని ఆ ర్యాలీ నిరూపించింది. సైనిక బలగాల్లోని మహిళల ధైర్యసాహసాలు, అంకితభావం, తపన, నిబద్ధతలకు నిదర్శనంగా నిలిచింది. నారీశక్తికి ప్రపంచం ప్రణామం చేసేలా ఆ ర్యాలీ సాగింది.
25మంది మహిళల బృందం ఆ ర్యాలీని నిర్వహించింది. వారిలో అత్యధికులు సైనికబలగాల్లో పనిచేస్తున్న మహిళలు, లేదా పనిచేస్తున్నవారి భార్యలే. 16 రోజుల ఆ ర్యాలీ లెహ్‌లోని యుద్ధ స్మారకం దగ్గర మొదలైంది, కార్గిల్ యుద్ధ స్మారకం దగ్గర ముగిసింది. ఆ ర్యాలీలో బైకర్ల బృందం ఐదు ప్రధాన స్మారకాలను దర్శించింది. అవి… లెహ్‌లోని హాల్ ఆఫ్ ఫేమ్, సియాచిన్ యుద్ధస్మారకం, చుషూలోని రెజాంగ్లా యుద్ధ స్మారకం, కారూలోని త్రిశూల్ యుద్ధస్మారకం, కార్గిల్ యుద్ధ స్మారకం. ఆ ర్యాలీలో భాగంగా సాహసమహిళల బృందం సముద్రమట్టానికి 18,380 అడుగుల ఎత్తులోని ఖార్డుంగ్ లా, 19,300 అడుగుల ఎత్తులోని ఉమ్లింగ్ లా కనుమలనుంచి కూడా ప్రయాణం సాగించింది.
కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరులకు నివాళి అర్పించడానికి నిర్వహించిన ఈ ర్యాలీని భారతసైన్యంతో పాటు పలు ప్రభుత్వరంగ సంస్థలు నిర్వహించాయి, భారత జవాన్ల ధైర్యసాహసాలపట్ల తమ గౌరవాన్ని చాటుకున్నాయి.