కావడి యాత్రా మార్గంలో వ్యాపారులు పేర్లు కనిపించేలా బోర్డులు పెట్టుకోవాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలపై అమెరికా స్పందించింది. పాక్ విలేకరి అడిగిన ప్రశ్నకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఆచితూచి స్పందించారు. అమెరికా మతస్వేచ్ఛను గౌరవించడాన్ని ప్రోత్సహిస్తోందని మిల్లర్ గుర్తుచేశారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, కావడి యాత్ర మార్గంలో వ్యాపారుల పేర్లతో కూడిన బోర్డుల ఏర్పాటుపై సుప్రీంకోర్టు తీర్పు విషయం కూడా తమకు తెలుసని చెప్పారు.
అమెరికా మత స్వేచ్ఛను ఎల్లప్పుడూ గౌరవిస్తుందని, అన్ని మతాలను గౌరవించే విషయంలో భారత్‌తో కలసి పనిచేస్తామన్నారు. కావడి యాత్రా మార్గంలో వ్యాపారుల పేర్లు ప్రదర్శనపై పాక్ విలేకరులు అవకాశం దొరికిన ప్రతి వేదికపై ప్రశ్నలు వేస్తున్నారు. అమెరికా విదేశాంగ శాఖ ఎలాంటి మీడియా సమావేశం పెట్టినా, కావడి యాత్రపై పాక్ విలేకరులు ప్రశ్నలు వేయడం పరిపాటిగా మారింది.
కావడి యాత్రా మార్గంలో వ్యాపారాలు చేసే వారు పేర్లతో కూడిన బోర్డులు పెట్టాలంటూ ఉత్తరప్రదేశ్‌లోని ముజఫరాబాద్ పోలీసులు జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. వ్యాపారి పేరు కన్నా, వారు తయారు చేసిన ఆహారం వివరాలు ఉంటే చాలని తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.