లోక్‌సభ ఎన్నికల తర్వాత త్రిపురలో బీజేపీ మరో విజయం సాధించింది. ఆగస్టు 8న జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో 71శాతం స్థానాలను కమలదళం ఏకగ్రీవంగా దక్కించుకుంది.
త్రిపుర పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణకు జులై 22 ఆఖరి తేదీ. ఆ రోజు వరకూ దాఖలైన నామినేషన్లను పరిశీలిస్తే 71శాతం స్థానాల్లో బీజేపీ అభ్యర్ధులు మాత్రమే నామినేషన్ వేసారు. దాంతో ఆ పార్టీ త్రిపుర పంచాయతీల్లో ఘనవిజయాన్ని దక్కించుకుంది.
జిల్లా పరిషత్తులు, పంచాయతీ సమితులు, గ్రామపంచాయతీలు అన్నీ కలిపి త్రిపురలో 6889 స్థానాలు ఉన్నాయి. వాటిలో 4805 స్థానాలకు బీజేపీ అభ్యర్ధులు తప్ప ఎవరూ నామినేషన్లు వేయలేదు. ఉపసంహరణ గడువు పూర్తయిన తర్వాత వాటన్నింటిలో బీజేపీ అభ్యర్ధులు తప్ప మరెవరూ నామినేషన్లు వేయలేదు. దాంతో ఆ స్థానాల్లో ఎన్నికలు జరగబోవని ఎలక్షన్ కమిషన్ నిర్ధారించింది.
త్రిపుర రాష్ట్ర ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం మొత్తం 1819 గ్రామపంచాయతీల్లో బీజేపీ అభ్యర్ధులు 1809 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. సిపిఎం 1222 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 731 స్థానాల్లోనూ అభ్యర్ధులను నిలబెట్టాయి.
మొత్తం 423 పంచాయతీ సమితుల్లో బీజేపీ 235 స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. మరో 188 స్థానాల్లో మాత్రం ఎన్నికలు జరుగుతాయి.
జిల్లా పరిషత్ సీట్లు మొత్తం 116 ఉంటే వాటిలో బీజేపీ 20 సీట్లను ఏకగ్రీవంగా గెలిచింది. మిగతా 96 స్థానాలకూ పోటీ జరగనుంది. అన్ని సీట్లలోనూ బీజేపీ అభ్యర్ధులు ఉన్నారు. సిపిఎం 81 సీట్లలోనూ, కాంగ్రెస్ 76 స్థానాల్లోనూ బరిలో ఉన్నాయి.
క్రిందటిసారి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ 96శాతం స్థానాలను గెలుచుకుంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 2 ఎంపీ సీట్లలోనూ కమలదళమే భారీ మెజారిటీలతో విజయాలు సాధించింది.