టీడీపీ ఎన్నికల హామీ మేరకు ‘తల్లికి వందనం’ పథకంపై మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ‘తల్లికి వందనం’ వర్తిస్తుందని నారా లోకేశ్ స్పష్టం చేశారు.
ఈ పథకంపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పిన మంత్రి, పథకానికి సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులందరికీ పథకం వర్తిస్తుందన్నారు.
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఇస్తామని ఎన్నికల ప్రచారంలోనే వాగ్దానం చేశామని చెప్పారు. మాటకు కట్టుబడి ఉన్నామన్న నారా లోకేశ్ నిబంధనలు రూపొందించేందుకు కాస్త సమయం కావాలన్నారు.
గత ప్రభుత్వంలో ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి… ఆ తర్వాత రూ.14 వేలు, అనంతరం రూ.13 వేలకు తగ్గించారన్నారు. అర్హత నిబంధనలు కూడా గత ప్రభుత్వం మార్చిందని వెల్లడించారు. ‘తల్లికి వందనం’ కింద ప్రతీ ఒక్క విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామన్నారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, విజయవాడ హెల్త్ వర్సిటీ పేరు మార్పు బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై మంత్రి సత్యకుమార్ యాదవ్ చర్చను ప్రారంభించారు. అనంతరం రెండు బిల్లులు సభ ఆమోదం పొందినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. విజయవాడ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్దరించారు.