కృష్ణపట్నం పోర్టు కోసం పారిశ్రామికవేత్త అదానీ కాళ్ళు మొక్కేందుకు సిద్ధమని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో భాగంగా నేడు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణపట్నంలో కంటైనర్ పోర్టును అదానీ తొలగించడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
కృష్ణపట్నం నుంచి పోర్టు తొలగించడంతో పదివేల మంది ప్రత్యక్షంగా ఉపాధి కోల్పోయారని తెలిపారు. పోర్టు కోసం
భూములిచ్చిన రైతులకు కూడా నష్టం జరుగుతుందని వివరించారు. అమరావతి నిర్మాణానికి అవసరమైన పరికరాలను గతంలో కృష్ణపట్నం పోర్టు నుంచే దిగుమతి చేసుకున్నామని గుర్తు చేశారు. కంటైనర్ పోర్టు ఎత్తేయడంతో మొత్తంగా 25 వేల ఎకరాల్లో ఉన్న వివిధ సెజ్ ల్లో కార్యకలాపాలపై ప్రభావం పడుతుందన్నారు.
కంటైనర్ పోర్టు ఎత్తేసి బూడిద తరలించే బల్క్ కార్గో పోర్టు ఉండడంతో ఎవరికీ లాభమని ప్రశ్నించారు. పోర్టు కోసం సేకరించినఈ భూమి ఏమైపోతుందన్నారు. ఆక్వా రంగానికే నెలకు రూ. 1000 కోట్ల మేర నష్టం జరుగుతుందన్నారు. ఈ విషయంలో మారిటైం బోర్డు ఏం చేస్తుందని ప్రశ్నించారు.