విపక్ష పాలిత రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపుల్లో వివక్ష చూపించారంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. బడ్జెట్ ప్రసంగంలో అన్ని రాష్ట్రాల పేర్లూ ప్రస్తావించడం సాధ్యంకాదని తేల్చిచెప్పారు.
ఇవాళ రాజ్యసభలో విపక్షాలు రగడ చేసి వాకౌట్ చేసిన తర్వాత, ఆర్థికమంత్రి పెద్దల సభలో మాట్లాడారు. ‘‘ప్రతిపక్షాలు, ప్రత్యేకించి సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే ప్రవర్తన దురదృష్టకరం. వారు ఆరోపణలు చేసి వెళ్ళిపోయారు. కనీసం నేను ఏం చెబుతానో వింటే బాగుండేది. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంచి వారు నా వివరణ విని ఉండవలసింది. నా ప్రసంగంలో కేవలం రెండు రాష్ట్రాల గురించే చెప్పాను, మరెన్నో రాష్ట్రాల గురించి మాట్లాడలేదని ఖర్గే అన్నారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం అధికారంలో ఉంది. వారూ ఎన్నో బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ప్రతీ బడ్జెట్లోనూ ప్రతీ రాష్ట్రం పేరూ ప్రస్తావించే అవకాశం రాదన్న సంగతి వాళ్ళకు స్పష్టంగా తెలిసే ఉంటుంది’’ అని నిర్మలా సీతారామన్ చెప్పారు.
ఆర్థికమంత్రి మహారాష్ట్ర ఉదాహరణ ఇచ్చారు. ఫిబ్రవరి 1న సమర్పించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కానీ, నిన్నటి వార్షిక బడ్జెట్లో కానీ ఆ రాష్ట్రం పేరు లేదు. ‘‘మహారాష్ట్రలోని వధవన్ దగ్గర పెద్ద ఓడరేవు నిర్మించాలని ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాజెక్టుకు 76వేల కోట్లు ప్రకటించారు. ఆ రాష్ట్రం పేరు నిన్నటి బడ్జెట్లో ప్రస్తావించలేదు. దానర్ధం మహారాష్ట్రను విస్మరించామని కాదు కదా. ఏదైనా రాష్ట్రం పేరు చెప్పనంత మాత్రాన భారత ప్రభుత్వపు పథకాలు, కార్యక్రమాలు, ఎక్స్టెర్నల్ ఎయిడెడ్ అసిస్టెన్స్ ఆ రాష్ట్రానికి వర్తించవా?’’ అని మంత్రి నిలదీసారు.
ఎన్డీయే-యేతర పార్టీల పాలనలోని రాష్ట్రాలకు కేంద్రం ఏమీ ఇవ్వలేదన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడానికి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఇటువంటి నాటకాలు ఆడుతున్నాయని నిర్మల ఆరోపించారు. ‘‘వారి ఆరోపణలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తమ బడ్జెట్ ప్రసంగాల్లో అన్ని రాష్ట్రాల పేర్లూ ప్రస్తావించిందా?’’ అని ప్రశ్నించారు.