ఈ ఉదయం పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిన్న సమర్పించిన బడ్జెట్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు రచ్చ చేసాయి. మంత్రి సమాధానం ఇస్తున్న సమయంలో వాకౌట్ చేసాయి.
మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండీ కూటమి సభ్య పక్షాలు సమావేశం అయ్యాయి. ఆ సమావేశానికి రాహుల్ గాంధీ, ప్రమోద్ తివారీ, గౌరవ్ గొగోయ్ (కాంగ్రెస్), శరద్ పవార్ (ఎన్‌సిపి-ఎస్‌సిపి), సంజయ్ రౌత్ (శివసేన-యుబిటి), డెరెక్ ఓ బ్రెయిన్ (తృణమూల్), టిఆర్ బాలు (డిఎంకె), మహువా మాజీ (జెఎంఎం), రాఘవ్ ఛద్దా, సంజయ్ సింగ్ (ఆప్), జాన్ బ్రిటాస్ (సిపిఎం) హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కెసి వేణుగోపాల్, జైరాం రమేష్ కూడా హాజరయ్యారు.
ఆ సమావేశంలో ఇండీ కూటమి పార్టీలు, ఇవాళ పార్లమెంటులో ఆందోళన చేయాలని ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నాయి. జులై 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని కూడా బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి.
ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ఎన్డీయే కూటమి మిత్రపక్షాలు తెలుగుదేశం, జేడీయూ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు కొన్ని ప్రత్యేక ప్రకటనలు చేసారు. దాంతో విపక్ష పాలిత రాష్ట్రాలకు నిధులు కేటాయించలేదని, వారిపై వివక్ష చూపారనీ ఇండీ కూటమి పక్షాలు ఆరోపణలు చేసాయి. ఇవాళ ఉభయ సభల్లోనూ అదే అంశంపై రచ్చ చేసాయి.