చంద్రుడి దక్షిణధ్రువం మీదకు భారతదేశం చేసిన అంతరిక్ష యాత్ర ‘చంద్రయాన్-3’ మరో ఘనత సాధించింది. ఇంటర్నేషనల్ ఆస్ట్రనాటికల్ ఫెడరేషన్ ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ స్పేస్ అవార్డ్ గెలుచుకుంది. ఆ అద్భుతమైన ప్రయోగం భారతదేశాన్ని అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన నిలిపింది.
ఈ పురస్కార ప్రదానం అక్టోబర్ 14న జరుగుతుంది. ఇటలీలోని మిలాన్ నగరంలో జరిగే 75వ ఇంటర్నేషనల్ ఆస్ట్రనాటికల్ కాంగ్రెస్ సమావేశంలో ఆ పురస్కారాన్ని అందజేస్తారు. 2023 ఆగస్టు 23న విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలం మీద దిగడంతో చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది.
ఈ ప్రయోగంతో చందమామ దక్షిణధ్రువం మీద దిగిన మొట్టమొదటి దేశంగా భారత్ ఘనకీర్తి సాధించింది. చంద్రయాన్-3ని గొప్ప ప్రయోగంగా ఐఎఎఫ్ ప్రశంసించింది. ‘‘వైజ్ఞానిక కుతూహలాన్నీ, చవకైన ఇంజనీరింగ్ ప్రతిభనీ కలగలిపి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ ఘనతను సాధించింది. అద్భుతమైన సమర్థతకూ, అనంతమైన ప్రతిభకూ భారతదేశపు అంకితభావానికి నిదర్శనంగా నిలిచింది. చంద్రుడి ఉపరితలం గురించి గతంలో అంతకుముందు ఎన్నడూ తెలియని క్రొంగొత్త విషయాలను ఆవిష్కరించడం ద్వారా ఆ ప్రయోగం, ఆవిష్కరణలకు అంతర్జాతీయ తార్కాణంగా నిలిచింది’’ అంటూ ఐఎఎఫ్ అభినందనల వర్షం కురిపించింది.
చంద్రయాన్-3 సాధించిన ఘనతల్లో ప్రధానమైనది భారతదేశపు అంతరిక్ష, పరమాణు పరిశోధనా రంగాలను విజయవంతంగా సమ్మిళితం చేయడం. చంద్రయాన్-3లోని ప్రొపల్షన్ మోడ్యూల్, పరమాణు సాంకేతికతతో పనిచేసేలా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. ఆ ఆవిష్కరణ భారతదేశపు అత్యాధునిక సామర్థ్యాలకు, ఆ మిషన్ సాంకేతిక అద్భుతాలకూ నిదర్శనంగా నిలిచింది. చంద్రయాన్‌లో ఉపయోగించిన కెమెరా నాణ్యతను కూడా ఐఎఎఫ్ ప్రత్యేకంగా గుర్తించింది. చంద్రుడి మీద అపోలో 11 ల్యాండ్ అయిన ప్రాంతాన్ని చంద్రయాన్ కెమెరా చిత్రీకరించింది. గతంలో అమెరికా, చైనా, దక్షిణ కొరియా, జపాన్ సైతం ఆ ప్రదేశాన్ని ఫొటోలు తీసినా, వాటన్నిటి కంటె అత్యుత్తమ నాణ్యత కలిగిన చిత్రాలను చంద్రయాన్-3 కెమెరాయే తీయగలిగింది.
చంద్రయాన్-3 మొదటి వార్షికోత్సవం నాడు భారతదేశం అంతటా పలు వేడుకలు జరగబోతున్నాయి. చంద్రయాన్ ప్రయోగం సాధించిన విజయాలనూ, అంతరిక్ష పరిశోధనా రంగానికి ఆ ప్రయోగం చేసిన సేవలనూ ప్రతిఫలించేలా ఆ వేడుకలు నిర్వహించనున్నారు. స్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ ప్రాధాన్యతను ప్రముఖంగా చాటడం, భవిష్యత్ తరాలకు స్ఫూర్తి కలిగించడం ఆ వేడుకల ప్రధాన ఉద్దేశం.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు